ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి
ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్
ఏచూరి జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు యంత్రాంగం ఏర్పాటు : ఎంఏ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం సీతారాం ఏచూరి బలమైన పోరాటాలు చేశారని ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ తెలిపారు. ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లడమే ఏచూరికి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. సోమవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ లో సీతారాం ఏచూరి మొదటి స్మారక ఉపన్యాసంలో ‘జాతీయ ఉద్యమంలో వామపక్షాల పాత్ర, వారసత్వం’ అనే అంశంపై ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ మాట్లాడారు. ఏచూరి తన జీవితాంతం సోషలిజం, ప్రజాస్వామ్యాన్ని సమర్థించారని తెలిపారు. సోషలిజం, ప్రజాస్వామ్యం మధ్య ఒక బొడ్డు తాడు సంబంధం ఉందని, ఒకటి లేకుండా మరొకటి ఆలోచించలేమని అన్నారు. నియంతృత్వంతో సోషలిజం అమలు చేయబడదని, సోషలిజం వాస్తవికతగా మారాలంటే, పూర్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పేర్కొన్నారు. ఏచూరి దాని కోసమే పోరాటాలు చేశారని తెలిపారు. ఆయన ఏచూరితో ఉన్న సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ సంబంధం విభేదాల కంటే ఒప్పందాలతోనే ముందుకు సాగిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఇండియాపై చూపిన ప్రభావాలను దేశ కమ్యూనిస్ట్ నాయకులు ప్రారంభం నుండి విమర్శించారని అన్నారు. 1840ల్లో కార్ల్ మార్క్స్ బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశాన్ని ఎలా దోపిడీ చేసిందో తీవ్రంగా పరిశోధించారని పేర్కొన్నారు. మార్క్స్ నుంచి ప్రేరణ పొంది, భారతదేశ కమ్యూనిస్ట్ నాయకులు వలసవాదం పరిణామాలను అధ్యయనం చేశారన్నారు. వలసవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ దృఢ వైఖరికి ఇటువంటి పరిశోధనలే ఆధారమని ఆయన వివరించారు. సుదీర్ఘ విరామం తరువాత 94 ఏండ్ల ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ బహిరంగ వేదికపైకి వస్తున్నారని తెలుసుకుని ఆయన మాటలను వినడానికి, ఏచూరి జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేసుకోవడానికి వందలాది మంది హరికిషన్ భవన్‌కు చేరుకున్నారు. ఏచూరి కుటుంబ సభ్యులు, నటి షర్మిలా ఠాగూర్, ఇతరులు కూడా హాజరయ్యారు.
ఏచూరి జీవిత సందేశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వేదిక : ఎంఎ బేబీ
ఏచూరి జీవిత సందేశాన్ని ప్రజలకు తెలియజేయడానికి పార్టీ ఆధ్వర్యంలో శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, మొదటి అడుగుగా, ఆసియాలో కమ్యూనిస్ట్, కార్మిక ఉద్యమాల చరిత్రను వివరించే డిజిటల్ ఆర్కైవ్‌ను రూపొందిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సెమినార్లు, చర్చలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సీపీఐ(ఎం) నేత ప్రకాశ్‌కరత్, పొలిట్‌బ్యూరో సభ్యులు యు.వాసుకి, ఆర్. అరుణ్‌కుమార్, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పాల్గొన్నారు.