Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంనాడు, నేడు కరేడు...

నాడు, నేడు కరేడు…

- Advertisement -

గిరిపుత్ర
ఫాదర్‌ ఆఫ్‌ పొలిటికల్‌ సైన్స్‌గా పేరొందిన అరిస్టాటిల్‌ రాజకీయాలను ఒక ఆచరణాత్మక శాస్త్రంగా చూశాడు. ఒక ఉత్తమమైన రాజకీయ క్రమాన్ని సాధించడానికి ఉద్దేశించబడినదిగా భావించాడు. అది సమాజ శ్రేయస్సును, ఆనందాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉండాలని కోరుకున్నాడు. మరి నేడున్న పరిస్థితులేమిటి? ఈనాటి రాజకీయ పార్టీలు, వాటి విధానాలు ఎలా ఉన్నాయి? అరిస్టాటిల్‌ ఆశించినట్టు సమాజ శ్రేయస్సు, ఆనందం కోసం పాటుబడడమా లేక సంపన్నుల ప్రయోజనాలు కాపాడడమా? రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, మనందరి జీవితానుభవాలూ పరిశీలిద్దాం. స్మార్ట్‌ మీటర్లు, సెకి- అదానీ ఒప్పందం కేసు, గోదావరి – బనకచర్ల, తాజాగా కరేడు వివాదం… ఇలా ఏది చూసినా పరస్పరం కత్తులు దూసుకునేలా మాట్లాడే రాజకీయ పార్టీలు విధానాల విషయంలో ఒకటిగానే ఉన్నాయని బోధపడుతోంది. వారూ వీరూ శత్రువుల్లా కనిపిస్తూనే బడా కార్పొరేట్లకు మిత్రులుగా భారీ లబ్ధి చేకూరుస్తున్నారని విదితమవుతుంది.


అదానీ- సెకి : జగన్‌ – మోడీ – చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వానికి ‘అక్షరమాల అంటే అదానీ, అంబానీ’ అని అందరూ అంటుంటారు. అటువంటి అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన సోలార్‌ విద్యుత్‌ను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) ద్వారా రాష్ట్ర డిస్కాముల చేత కొనిపించడానికి రూ.1,750 కోట్ల ముడుపులు ముట్టజెప్పారని అమెరికా కోర్టులో కేసు నమోదయిన విషయం అందరికీ తెలుసు. ఆ ఒప్పందం మూలంగా రాష్ట్రానికి పాతికేళ్లపాటు లక్ష కోట్లు నష్టం వాటిల్లుతుంది. మాజీ ముఖ్యమంత్రిపై ఘోరమైన ఆరోపణలు వచ్చాయి కనుక ఇప్పటి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటుందని జనం ఆశించారు. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విధంగానే మాట్లాడారు. ‘అమెరికా కోర్టులో వేసిన చార్జిషీట్‌ మా దగ్గర ఉంది, దానిని అధ్యయనం చేసి స్పందిస్తాం. మరింత సమాచారం సేకరిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తాం.’ అని 2024 నవంబర్‌ 22న శాసనసభకు చెప్పారు. నెల కూడా తిరగకముందే డిసెంబర్‌ 4న మీడియాతో మాట్లాడుతూ సెకితో విద్యుత్‌ పంపిణీ సంస్థలు చేసుకున్న ఒప్పందంపై ఆలోచిస్తున్నామని అన్నారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటే జరిమానా కట్టాల్సి ఉందని’ చెప్పుకొచ్చారు. ఇలా తప్పించుకున్న చంద్రబాబు కన్నంలో దొంగల్లా దొరికిన మాజీ సిఎం జగన్‌ను, అంతర్జాతీయ గజదొంగలాంటి అదానీ కంపెనీని వదిలేశారు. రాష్ట్ర విద్యుత్‌ వినియోగదార్లనుండి లక్షల కోట్లు కొల్లగొడుతున్న అదానీ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం, అప్పటి, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై లబ్ధి చేకూర్చాయి. ఇదీ అసలు మర్మం.


పగలగొట్టమన్న స్మార్ట్‌ మీటర్లే ఇప్పుడు ముద్దు
ప్రస్తుత విద్యా శాఖామాత్యులు నారా లోకేష్‌ తన యువగళం పర్యటన సందర్భంగా రైతులనుద్దేశించి.. ‘మీ పంప్‌సెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టండి’ అని పిలుపునిచ్చారు. అది విన్న జనం జగన్‌ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు కొత్త ప్రభుత్వంలో ఉండవని ఆనందించారు. కానీ, అప్పుడు వాణిజ్య కనెక్షన్లకే పరిమితమైన స్మార్ట్‌ మీటర్లు టిడిపి కూటమి సర్కారు వచ్చాక ఇళ్లకు సైతం బిగిస్తున్నారు. గంటకో రేటుగా చార్జీ వసూలు చేసే ‘టైమ్‌ ఆఫ్‌ ద డే’ టారిఫ్‌ విధిస్తున్నారు. గత ప్రభుత్వం, ఇప్పటి సర్కారు రెండూ బిగిస్తున్నది అదానీ కంపెనీకి చెందిన స్మార్ట్‌ ప్రీ పెయిడ్‌ మీటర్లే! వారి టెండర్లే ఓకే అవుతాయి. కాబట్టి అధికారంలో ఏ పార్టీ వున్నా జరిగేది అదానీ కంపెనీ బేరమే! ఇదీ లోగుట్టు!


గేమ్‌ ఛేంజర్‌ బనకచర్ల?
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో భారీ వ్యయం, ఆయకట్టుతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. (ఇప్పుడు కమిషన్లు, విచారణలతో ఒక వివాదాలమయమైందనుకోండి) దాన్ని చూసిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మనకూ ఒక కాళేశ్వరం లాంటిది ఉండాలి కదా అని గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. కేంద్రం వద్ద ప్రతిపాదనలు కూడా చేశారు. తరువాత అది వెనక్కుపోగా కొత్తగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం దాన్ని సొరుగులోంచి తీసి సొబగులద్దింది. నామమాత్రపు నీటి తీరువా చెల్లించి సాగునీటిని వాడుకుంటున్న రైతులు ఈ ప్రాజెక్టు వస్తే ‘రేటు’ చెల్లించే విధానం తెస్తామని సిఎం చంద్రబాబు చెబుతున్నారు. నీటిని వాణిజ్య సరుకుగా మార్చే ఈ ప్రతిపాదన ఆ విధంగా గేమ్‌ ఛేంజరే! రూ.80 వేల కోట్లకుపైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు మూలంగా నష్టపోయేది రైతులు, ప్రజలూ కాగా లబ్ధి పొందేది మాత్రం భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించే కంపెనీలే! అందుకు ‘మెఘా’ కంపెనీనే గత సర్కారు, నేటి ప్రభుత్వమూ ఎంపిక చేశాయన్నది జనవాక్యం. కేంద్రంలోనూ కాగల కార్యాలను వారే చక్కబెడుతున్నారని అంతా చెప్పుకొంటున్నారు.


డొల్ల కంపెనీల కరేడు!
నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్‌ కంపెనీకి ఎనిమిది వేల ఎకరాల భూపందేరానికి నిరసనగా అక్కడి ప్రజలు జాతీయ రహదారిని దిగ్బంధనం చేయడంతో పెను సంచలనంగా మారింది. ఇప్పుడు ముందుకొచ్చినా ఇది కూడా పాత అంశమే! ఆ భూముల్లో ప్రాజెక్టు పెడతామంటున్న ఇండోసోల్‌, షిరిడి సాయి కంపెనీలు రాష్ట్రానికి కొత్త కాదు. 2023 అక్టోబర్‌ 26న టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”అధిక ధరకు డిస్కములు ట్రాన్స్‌ఫార్మర్లు (షిరిడి సాయి ఎలక్ట్రికల్‌ నుంచి) కొనుగోలు చేయడంపై సిబిఐ విచారణ జరపాలని” డిమాండ్‌ చేశారు. ఇది భారీస్కాం అని, డిస్కములు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆరోపించారు. నవంబర్‌ 2న బిజెపి అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ‘ఇండోసోల్‌ సోలార్‌, షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల బినామీ కంపెనీల’ని ఆరోపించారు. నవంబర్‌ 15న జనసేన నేత, ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి ముఖ్యమంత్రి సన్నిహితులు 22 నెలల క్రితం ముందుకు తెచ్చిన డొల్ల కంపెనీ అని ఆరోపించారు. కాబట్టి వైసిపి నాయకుల బినామీలకు టిడిపి కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాల విలువైన భూములు కట్టబెడుతోందా? ఇది నిజమా? కాదు.. కాదంటూ ఎలక్టొరల్‌ బాండ్లు సాక్ష్యం చెబుతాయి. షిరిడీ సాయి కంపెనీ టిడిపికి 2024 జనవరిలో రూ.40 కోట్ల విలువ చేసే ఎలక్టొరల్‌ బాండ్లు చెల్లించింది. అసలు కథ ఇదీ! అందుకే ఆ ఊళ్లలో జనం రోడ్డెక్కినా అటు అధికార కూటమి లేదా ఇటు ప్రధాన ప్రతిపక్షం

కిమ్మనడం లేదు.
– అదానీ దోపిడీని విడమర్చినది, దానిపై పోరాడుతున్నదీ ఎవరు?
– స్మార్ట్‌ మీటర్ల గుట్టు విప్పిందెవరు? వాటికి వ్యతిరేకంగా జనాన్ని కదిలిస్తున్నదెవరు?
– కరేడులో జనం ఘోష పట్టించుకున్నదెవరు? వారికి అండగా నిలుస్తున్నదెవరు?
– ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం… అది సిపిఎం, వామపక్షాలేనని!
– పాలకవర్గ పార్టీల నైజాన్ని జనం గుర్తెరిగి వాటిని తిప్పిగొట్టేందుకు భుజం భుజం కలిపి పోరాడాలి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -