అలనాటి బాలీవుడ్ నటి, ప్రముఖ దర్శక, నిర్మాత వి.శాంతారామ్ భార్య సంధ్యా శాంతారామ్ (94) కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా ఆమె శనివారం తుది శ్వాస విడిచారు. సంధ్య హిందీతోపాటు పలు మరాఠీ చిత్రాల్లోనూ నటించారు. ‘అమర్ భూపాలి’, ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’, ‘నవరంగ్’, ‘పింజారా’, ‘దో ఆంఖ్ బారా హాత్’, ‘తీన్ బత్తీ చార్ రస్తా’, ‘స్త్రీ’ వంటి అనేక క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. అమె అద్భుతమైన నటన, ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసే నృత్య ప్రదర్శనలతో భారతీయ సినిమాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
తన భర్త శాంతారామ్ దర్శకత్వంలోనే ఆమె చాలా చిత్రాల్లో నాయికగా నటించడం విశేషం. అంతేకాదు సంధ్యని వెండితెరకు పరిచయం చేసింది కూడా ఆయనే. 1951లో ‘అమర్ భూపాలి’ చిత్రం కోసం కొత్త నాయికల కోసం చూస్తున్న తరుణంలో సంధ్య ఫొటోలను చూసి, ఎంపిక చేశారు. ఆ సినిమాతో ప్రారంభమైన వీరి స్నేహం..వివాహ బంధంలోకి అడుగు పెట్టేలా చేసింది. సంధ్య మృతి పట్ల బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ఎక్స్ వేదికగా లెజెండరీ నటి సంధ్యా శాంతారామ్‌జీ మరణం భాదాకరమని, ఆమె నటించిన చిత్రాలలోని ఐకానిక్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ నివాళులర్పించారు.
అలనాటి బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -