ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు ఆదేశం
నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ ఝాలకు నోటీసులు
బదిలీ పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరన్న బెంచ్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తాము ఆదేశించిన తర్వాత బదిలీ అయ్యామని చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకోలేరని ఐఏఎస్‌లకు హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలు వెలువడ్డాక అమలు చేయకుండా ఇప్పుడు బదిలీ అయ్యామనీ, తమకు సంబంధం లేదంటే కుదరదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలని ఫైళ్లలో పెట్టేసి బదిలీపై వెళ్లిపోయామంటే ఎలాగని ప్రశ్నించింది. మిడ్‌మానేరు ప్రాజెక్ట్ కోసం పిటిషనర్ నుంచి సేకరించిన భూమికి మూడు నెలలో పరిహారం చెల్లిస్తామని హైకోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయని అప్పటి రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, అప్పటి సిరిపిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మార్చి 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.
విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేననీ, ఎనిమిది వారాల్లో పరిహారం చెల్లించాలనే ఆదేశించింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు ముంపునకు గురైన 2.01 ఎకరాల భూమిని అధికారులు 2010లో భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. తనకు పరిహారంగా ఇంటి జాగా, వ్యవసాయేతర భూమి 2,783 చదరపు గజాలు ఇవ్వలేదంటూ బి రామవ్వ పిటిషన్ దాఖలు చేశారు. మూడు మాసాల్లో పరిహారం చెల్లిస్తామని అధికారుల హామీని గతంలో హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసి పిటిషన్‌పై విచారణను ముగించింది. ఐదు నెలలయినా పరిహారం చెల్లించకపోవడంతో రామవ్వ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ ఎస్‌వి శ్రవణ్‌కుమార్ మంగళవారం విచారించారు. గత విచారణలో ఆదేశించిన మేరకు ఇద్దరు ఐఏఎస్ అధికారులు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీసీఎల్‌ఏ లోకేష్ కుమార్, సిరిసిల్ల కలెక్టర్‌గరిమా అగర్వాల్ వేసిన పిటిషన్లను అనుమతించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ బదిలీ అయ్యారని చెప్పడంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై స్పందించాలన్నారు. పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్‌కు చెందిన స్థలాన్ని 2010లోనే తీసుకున్నారనీ, ఇది ప్రస్తుతం ముంపునకు గురైందని చెప్పారు. దీనిపై హైకోర్టు, మూడు నెలల్లో పరిహారం చెల్లిస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. పిటిషనర్ వయసు 75 ఏండ్లని గుర్తు చేసింది. ఎనిమిది వారాల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హాజరు మినహాయంపు కోరుతూ సీసీఎల్‌ఏ, కలెక్టర్లు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతించింది. ఆర్డీవో విచారణకు హాజరయ్యారు. నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ మార్చి 24న జరిగే విచారణకు స్వయంగా హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది.
కన్యకాపరమేశ్వరి ఆలయ పనులపై స్టేటస్‌కో
సికింద్రాబాద్ సోమసుందరం వీధి ఆవుల మండలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ పనులపై యధాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆలయ పునర్నిర్మాణ పనుల వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఎలాంటి అధికారం, అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో పునర్ నిర్మిస్తామంటూ చేస్తున్నారంటూ రాష్ట్ర దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారించారు.
తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేశారు. ఎలాంటి అనుమతి లేకుండా కన్యకాపరమేశ్వరి ఆలయాన్నినిర్మిస్తున్నారంటూ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారించారు. న్యాయవాది వాదిస్తూ, శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థాన సంఘం చేసే పనులను ఆపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు. ఆలయ కూల్చివేత, పునర్నిర్మాణంపై సంబంధిత అధికారుల నుంచి అనుమతి లేకుండా పనులు చేయడం చెల్లదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు స్టేటస్‌కో ఆదేశాలు కొనసాగుతాయని చెప్పింది.
ఫుడ్ జోన్ ఏర్పాటు అనుమతుల రద్దు సబబే
ఆయిల్ పామ్ సాగు కోసం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఫ్యాక్టరీ జోన్ ఏర్పాటు రద్దు ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ మేరకు గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. పతంజలికి ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. ఉపశమనం కోరుతూ పతంజలి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్(ఎన్‌ఎంఈవోువోపీ) పథకం కింద పతంజలి(గతంలో రుచి సోయా ఇండిస్టీస్ లిమిటెడ్)కి 2012లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు, ప్రాసెసింగ్ కోసం ఫ్యాక్టరీ జోన్‌లను కేటాయించారు.
ఒప్పందం ప్రకారం 24 నెలల్లో ప్రాసెసింగ్ మిల్లు ప్రారంభించాలన్న షరతు అమలు చేయని కారణంగా సూర్యాపేట ఫ్యాక్టరీ జోన్ కేటాయింపును రద్దు చేస్తూ గతేడాది మార్చి 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యను సవాల్ చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీంతో పతంజలి దాఖలు చేసిన అప్పీల్ మధ్యంతర పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ప్రధాన పిటిషన్‌పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చెల్లదు
అటవీ శాఖ అధికారులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ) యాక్ట్ కింద కేసులను నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఐపీసీ కింద కేసుల నమోదు అధికారం పోలీసులకు మాత్రమే ఉందని పేర్కొంది. అటవీ అధికారులకు వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చే సే అధికారం ఉందని తెలిపింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో అక్రమంగా ప్రవేశించి అధికారిపై దాడి చేశారంటూ తమపై బనాయించిన కేసును కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్ నగరానికి చెందిన సాయి రోహిత్ ఇతరులు వేసిన పిటిషన్‌లో న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు ఈ తీర్పు వెలువరించారు. ఐపీసీ సెక్షన్ల కింద పెట్టిన కేసుల్ని కొట్టివేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద పెట్టిన కేసులను కొట్టివేసేందుకు నిరాకరించారు. చట్ట ప్రకారం పిటిషనర్లపై ఐపీసీ కింద పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయవచ్చునని తీర్పులో పేర్కొన్నారు.
సమాచార బహిర్గతంపై వివరణ ఇవ్వండి
సిబిల్‌స్కోర్ రిపోర్టులో పబ్లిక్‌కు చెందిన ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించేందుకు అనుమతిస్తూ ఆర్‌బీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. కేంద్రం, ఆర్‌బీఐ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈసారి కౌంటర్ వేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. విచారణను వచ్చే నెల 17వ తేదీకి చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ రూల్స్‌ను సవరిస్తూ 2021లో ఆర్బీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్ తరఫు న్యాయవాది వాదిస్తూ, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా నోటిఫి కేషన్ ఉన్నందున దాని అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని, తుది ఉత్తర్వుల్లో నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరారు.
సినిమా టిక్కెట్ ధరల పెంపు వివాదం సింగిల్ జడ్జి వద్ద తేల్చుకోండి
షైన్‌స్క్రీన్ అప్పీలుపై హైకోర్టు
సినిమా టిక్కెట్ ధరల పెంపు వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ వ్యవహారంపై పిటిషన్ ఇంకా సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేసింది. కాబట్టి అక్కడే తేల్చుకోవాలంది. ‘మన శంకర వరప్రసాద్’ ‘రాజాసాబ్’ సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు వేసిన పిటిషన్‌లో సింగిల్ జడ్జి టిక్కెట్ ధరల పెంపు మెమోను రద్దు చేశారు. ఒకవేళ ధరలను పెంచాలంటే 90 రోజుల ముందుగా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఎల్‌ఎల్‌పీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ, టిక్కెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌లో సింగిల్ జడ్జి ప్రజాహిత వ్యాజ్యంలో మాదిరిగా ఆదేశాలిచ్చారని చెప్పారు. దీనిపై హైకోర్టు ప్రస్తుతం టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించిన పిటిషన్‌లు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఈ వివాదాన్ని అక్కడే తేల్చుకోవాలంది. ఇప్పటికే విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం ఏమీ లేదని గుర్తు చేసింది. ఈ పిటిషన్‌లపై సింగిల్ జడ్జి వీలైనంత త్వరగా తేల్చాలని సూచన చేసింది. అప్పీలుపై విచారణను మూసివేసింది.



