జెండా కర్రపట్టి కాళ్లరిగేలా తిరిగి
అలసిపోయిన గడపలకు
భరోసా ఒక బొమ్మలాట ఐపోయింది
జేజేలు పలుకుతూ భుజాన మోసి
అందలం ఎక్కించిన సామాన్యులకు
అడుక్కోవడం పనైపోయింది
నమ్మకాన్ని ముళ్లకంపల్లో వేసి
సింహాసనాన్ని అలంకరించుకుని
నింగికేసిన చూపులో ధిక్కారం
బాణమై సగటు మనిషిని కూల్చితే
ఏకరువును మోయడమే శాపమైంది
ఎద్దేవాల రాపిడిలో పరిపాలన
నిప్పురవ్వలై ఎగసిపడుతుంటే
చూస్తూ కూర్చోవడమే వంతైంది
గాలి విసురుల వాటపు మాటలతో
మురిసి మునగడమే ఖర్మైంది
ప్రశ్నించే ప్రతి నాలుకపై
వాతలు పెట్టే రాతలదే పైచేయిగా
ఆగ్రహం పడగలిప్పి బుసలు కొడితే
ఓ మూలకు చేరి బతకడమే పనైంది
ఇక ప్రశ్నలతోనే పరిష్కారానికి
పునాదులేసే సమయం వచ్చింది
ఓటుతో గురిచూసి కొట్టాల్సిన
సందర్భం ఆసన్నమైంది
ఇక నిగ్గదీసి అడగాల్సిందే..
మంచీచెడులు ఆలోచించాల్సిందే
- ఎన్.ఆర్.ఆర్,
9666016636



