నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ఆందోళన
శవపేటికను పోలీస్‌వాహనం ఎదుట పెట్టి నిరసన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆరేండ్లుగా సాగిన ప్రేమ ప్రయాణంలో చివరి మజిలి పెండ్లి. కానీ సదరు యువతి వేరే వ్యక్తిని పెండ్లి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. కాగా యువకుని ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. దోంచందకు చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి(29) మరో యువతి ఆరేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్‌రెడ్డి ఉపాధి నిమిత్తం లండన్‌లో ఉంటున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా సదరు యువతికి పెండ్లి సంబంధాలు వస్తున్నాయని, తనను పెండ్లి చేసుకోవాలని కోరింది. పలు సంబంధాలు రాగా.. తొలుత ఒకే చేస్తూ మళ్లీ క్యాన్సిల్ చేసినట్టు సమాచారం. దాంతో శ్రీకాంత్‌రెడ్డి వచ్చి పెండ్లి చేసుకునేందుకు సిద్ధపడగా.. వేరే వ్యక్తితో పెండ్లి కుదిరింది. ఈ విషయమై మాట్లాడేందుకు ఫోన్ చేస్తే తనకు ఫోన్ చేయొద్దని, మెస్సెజ్ చేయొద్దంటూ ఫోన్ కట్ చేసింది. ఈ నెల 7వ తేదీన పెండ్లి చేసేందుకు సిద్ధం కావడంతో యువకుడు 6వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో కుటుంబీకులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. యువకుని మరణవాంగ్మూలం నమోదు చేయగా ‘నన్ను ప్రేమ పేరుతో నమ్మించి వాడుకొని మోసం చేసింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాను. నా ఆత్మహత్యకు ఆమెనే కారణం’ అని పేర్కొన్నాడు.
మృతదేహంతో కుటుంబీకులు,
గ్రామస్తుల ఆందోళన
ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువతిపై, వారి కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మృతదేహంతో దోంచంద నుంచి ఏర్గట్ల మండల కేంద్రానికి వస్తుండగా.. పోలీసులు తాళ్లరాంపూర్ వద్ద అడ్డుకోవడంతో గ్రామస్తులు శవపేటికను పోలీస్ వాహనంపైకి ఎక్కించి నిరసన చేపట్టారు. అనంతరం ఏర్గట్ల మండల కేంద్రానికి చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు బైటాయించారు. సమాచారం అందుకున్న ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణ గౌడ్, ఏర్గట్ల ఎస్‌ఐ రాజేశ్వర్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినప్పుడే కుటుంబీకులు ఫిర్యాదు చేస్తే.. యువతి తండ్రి పలుకుబడితో పోలీసులు కేసును ముందుకు సాగనివ్వలేదని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఏసీపీ మాట్లాడుతూ.. మరణ వాగ్మూలం ప్రకారం న్యాయసహాయం తీసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
యువతి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



