Friday, July 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపోరుబాటలో యువజన విద్యార్థులు

పోరుబాటలో యువజన విద్యార్థులు

- Advertisement -

‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు…’గా కాంగ్రెస్‌ పాలన ఉందంటున్నారు రాష్ట్రంలోని విద్యార్థులు, యువత. గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ సర్కారు తమను పట్టించుకోని దరమిలా, కాంగ్రెస్‌పై వారు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ గత పంతొమ్మిది నెలల రేవంత్‌ సర్కార్‌ హయాంలో సైతం అవేవీ నెరవేరకపోవటంతో ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు ఉద్యమబాట పడుతున్నారు. రాష్ట్ర జనాభాలో నూటికి తొంభై శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తరగతులకు చెందిన వారే ఉన్నారు. ఆయా తరగతుల పిల్లలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సరిగ్గా అందితేనే తెలంగాణ ప్రగతి పథాన పయనిస్తుంది. కానీ గత ఆరేండ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పుల బకాయిలు రూ.8,518 కోట్లు పేరుకు పోయాయి. వీటిని ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవటంతో కాలేజీలు సర్టిఫికెట్లను ఇచ్చేం దుకు ససేమిరా అంటున్నాయి. దీంతో చదువు పూర్తయినా లక్షలాది మంది విద్యార్థులు ముందుకెళ్లలేని దుస్థితి. వారు తమ చదువును మధ్యలోనే ఆపేయాల్సిన దీన స్థితిలోకి నెట్టబడుతున్నారు. వీరిలో కొంతమంది చదువుకోసం తమ తల్లిదండ్రులు చేసిన అప్పులను తీర్చేందుకు వివిధ రకాల పనులకు వెళ్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తూ మానసికంగా కుంగిపో తున్నారు. అంతిమంగా ఇది వారి విద్యా ప్రమాణాలను, నైపుణ్యాలను దెబ్బతీస్తుండటం బాధాకరం.
మరోవైపు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు… విద్యాసంస్థలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయన్నది యాజమాన్యాల వాదన. ఆ నిధులను సకాలంలో విడుదల చేయకపోవటం వల్ల కాలేజీలు, వర్సిటీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయన్నది మేనేజ్‌మెంట్ల ఆందోళన. ఫలితంగా మొత్తం విద్యా వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశముంది. దీంతో విద్యలో సామాజిక అసమానతలు, అంతరాలు పెరగుతాయన్నది నిపుణుల హెచ్చరిక.
విద్యార్థుల సమస్యలు ఈ విధంగా ఉంటే.. రాష్ట్రంలోని నిరుద్యోగుల గోస మరింత ఎక్కువగా ఉంది. తెలంగాణలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ హామీనిచ్చిన గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌… దాన్ని నెరవేర్చక పోగా కొలువులివ్వకుండా తాత్సారం చేసింది. కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల విషయంలో కూడా కోర్టు కేసులు, పేపర్‌ లీకేజీలతో తీవ్రమైన కాలయాపన చోటు చేసుకుంది. ఫలితంగా గులాబీ పార్టీని గద్దె దింపిన నిరుద్యోగ యువత, హస్తం పార్టీకి అధికారమిచ్చింది. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో నేటి సీఎం రేవంత్‌రెడ్డి, ఆనాటి సీఎల్పీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులకు మద్దతుగా పాదయాత్రలు కూడా చేపట్టారు. హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌లోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిరుద్యోగులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్న విషయం విదితమే. కాంగ్రెస్‌ అధి కారంలోకి వస్తే జాబ్‌ క్యాలెండర్‌ వేయటంతోపాటు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామంటూ రాహుల్‌ అప్పట్లో హామీ నిచ్చారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా యూత్‌ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చింది. కానీ తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న రేవంత్‌ సర్కార్‌.. ఆ హామీని నిలబెట్టుకోకపోగా గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా 55,424 కొలువులను మాత్రమే నింపింది. మిగతా ఉద్యోగ ఖాళీల గురించి పట్టించుకోక పోవటం, జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దిష్టత లేకపోవటం, తాను వాగ్దానం చేసిన విధంగా యూత్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవటంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. మరోవైపు ఆర్భాటంగా ప్రకటించిన రాజీవ్‌ యువ వికాసం పథకం కూడా అతీగతీ లేకుండా పోయింది.
పైకి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు తార్కాణాలుగా నిలుస్తున్నా…మనదేశంపై రుద్దబడుతోన్న సరళీకరణ ఆర్థిక విధానాలకు అసలు సిసలు ఫలితాలు. దేశాన్ని గతంలో పాలించిన కాంగ్రెస్‌ వీటిని ప్రారంభిస్తే… కేంద్రంలోని నేటి మోడీ సర్కారు రెట్టింపు వేగంతో వాటిని అమలు చేస్తోంది. నూతన విద్యా విధానం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ కూడా ఇందులో భాగమే. వీటిని తీసుకొచ్చిన కాంగ్రెస్సే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి… అది వీటిని వ్యతిరేకిస్తుందని ఊహించటం అత్యాశే అవుతుంది. ఇది గమనించిన విద్యార్థి లోకం, యువత తమ పోరాటాలకు పదును పెడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -