గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నూతన ఆవిష్కరణలే యువతరం భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారంనాడిక్కడి టీ-హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్ హబ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువకులు శక్తివంతులనీ, వారు కలల్ని సాకారం చేసుకోవాలనుకుంటారని చెప్పారు. దానికోసం టీంవర్క్ విజయానికి తొలిమెట్టు అవుతుందంటూ ‘ఫుట్‌బాల్’ ఆటను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉదహరించారు. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కాలిఫోర్నియాలో ఓ గ్యారేజీలో స్టార్టప్‌ను ప్రారంభించారనీ, ఇప్పుడదే ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్దిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని రెండ్రోజులు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించామని తెలిపారు.
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 20 ఏండ్లక్రితం ప్రారంభించిన అనేక స్టార్టప్స్ నేడు బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయంటూ గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్‌బుక్ వంటి పలు ఉదాహరణలు చెప్పారు. గడచిన 25 ఏండ్లలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనేక స్టార్టప్స్ పెద్ద కంపెనీలుగా ఎదిగాయన్నారు. యువతరం హైదరాబాద్ ప్రోడక్ట్ బేస్డ్ స్టార్టప్స్, ఇన్నోవేటీవ్ స్టార్టప్స్, ఐపీ ఇంటెన్సీవ్ స్టార్టప్స్‌పై దృష్టి పెట్టాలని తెలిపారు. హైదరాబాద్ కేవలం స్టార్టప్స్ హబ్‌గా ఎదగడమే కాదనీ, కనీసం వంద స్టార్టప్‌లు యూనికార్న్ కంపెనీలుగా, ఒక బిలియన్ డాలర్ల విలువకలిగిన సంస్థలుగా ఎదగాలని అభిలషించారు. 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలనీ, దానికోసం రాష్ట్రంలో మంచి ఎకోసిస్టమ్‌ను సృష్టిస్తామన్నారు. గూగుల్‌కు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. యువతరం ఆ ఫండ్‌ను వినియోగించుకొని, ఆర్థికంగ ఎదగాలని దిశానిర్దేశం చేశారు.
యువతా… నీదే భవిత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



