Wednesday, December 3, 2025
E-PAPER
Homeఎడిట్ పేజియువత పశ్న్రించాలి

యువత పశ్న్రించాలి

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో నేడు గ్రామాల్లో యువత చాలా బిజీ బిజీగా ఉంది. ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తే, మరొకరు పక్కన ఉండి గ్యాంగులు పెట్టి పోటీని కుదుపు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో యువకులంతా ఎక్కడో ఒక్కో క్యాంపులో, ఏదో ఒక గ్రూప్‌లో, ఏదో ఒక పార్టీ లో మునిగిపోయారు. రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో నూతన ఒరవడిని సృష్టించాల్సిన యువతను మాత్రం రాజకీయ పార్టీలు తమ అనుచరుల ద్వారా కొత్త వైన్స్‌ టెండర్లు వేసి ఇంటి మధ్యలోనే సెటప్‌ చేస్తున్నాయి. ఇందు గలదు అందు లేదు అన్న సందేహం లేకుండా పాఠశాలలు, ఆలయాల ముందు ఎక్కడచూసినా వైన్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. అయినా ఎందుకీ దౌర్భాగ్యం? అని నిలదీయాల్సిన యువత మాత్రం మత్తులో ఊగుతూ స్వార్థపూరిత రాజకీయ నాయకుల కబంధహస్తాల్లో కీలుబొమ్మలుగా మారుతున్నది. ఇది చాలా బాధాకరం.

ఇటీవల మేడ్చల్‌ జిల్లాలోని ఒక కాలనీ మధ్యలో వైన్స్‌ ఏర్పాటు చేస్తే అక్కడి రిటైర్డ్‌ ఉద్యోగులు, తల్లిదండ్రులు మాత్రమే వైన్‌షాప్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారే తప్ప ఒక్క యువకుడు కూడా దీనిపై స్పందించలేదు. అంటే మన భవిష్యత్‌ ఆశాకిరణాల రూపురేఖలు చాలా దయనీయంగా మన కండ్లముందు మెదులాడు తున్నాయి. కాబట్టి మన యువత ఎటు వైపు వెళుతోందనేది ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భమిది. ఒకప్పటి సాయుధ పోరాట గడ్డ మనది. నిజాంను ఎదిరించి, వేలాదిమంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నేల. ఒకప్పుడు ఇంటికొకరు పిడికిలి బిగించి భూమి కోసం, హక్కుల కోసం పోరాడిన ప్రాంతం. ఆ పోరాటం వల్లే నేడు మనకు భూమి వచ్చింది. కానీ, ఇప్పుడు పేదల భూములు కార్పొరేట్‌ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు, ఓఆర్‌ఆర్‌, త్రిబుల్‌ఆర్‌ పేరుతో లాక్కుంటున్నా ప్రశ్నిస్తున్నామా? లేదా అనేది యువత ఒకసారి ఆలోచించాలి.యువతరం శిరమెత్తితే సాధించలేనిదంటూ ఏదీ లేదు.మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలైంది.ఈ ఉద్యమం యావత్‌ దేశాన్ని కదిలించింది.

పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది మన తెలంగాణ మాత్రమే. ఓయు కేంద్రంగా,ఆర్ట్స్‌ కాలేజీ మెట్లపై విద్యార్థులు దేశంలో, రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద ప్రశ్నించేవారు, అనేక పోరాటాలు చేసేవారు.కానీ ఈ మధ్యకాలంలో ఆర్ట్స్‌ కాలేజీ వేదికగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని వీసీ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. అంటే ప్రశ్నించే గొంతులను నొక్కాలనే పాలకుల విధానం మనకు తేటతెల్లమవుతుంది.మన యువతలోనూ ప్రశ్నించేతత్వం రోజురోజుకూ తగ్గిపోతోంది.సాయుధ పోరాట గడ్డ అయిన మన ప్రాంతం ఇలాగే ఉంటే రేపటి మన తరం ఏమవుతుందో యువకులంతా అంతర్మథనం చేసుకోవాలి.ఒకప్పుడు గ్రామాల్లో, కాలేజీల్లో యూత్‌ గ్రూపులు జాతీయ నాయకుల పేర్లతో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు.

సమస్యలపై ఉద్యమాలు చేసేవారు.కానీ, నేడు యూత్‌ నాయకుల ఫొటోల కోసం, పోటీ కోసం, బర్త్‌డే బ్యానర్ల కోసం మాత్రమే పరుగులు తీస్తున్నది. నాయకులు, సినిమా హీరోల పుట్టినరోజు కార్యక్రమాలను పండుగలా చేస్తున్నాయి. కానీ నిజంగా చూస్తే నేడు మన ఇంటి సమస్యలు,విద్య, నిరుద్యోగం పండుగలా కనిపిస్తున్నాయా? కాబట్టి ఈ సమయంలోనే యువత ప్రశ్నించాలి.మన విద్య కోసం,మన వైద్యం కోసం,మన ఉపాధి కోసం ఇప్పుడు యువత పోరాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.కావున రేపటి తరాల కోసం,మన హక్కుల కోసం యువత మళ్లీ ప్రశ్నించాలి.మళ్లీ పోరాడాలి.మళ్లీ సంఘటితం కావాలి.ఇది మనందరి బాధ్యత.మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.

ఆర్‌.అరవింద్‌
9533687400

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -