నవతెలంగాణ – హైదరాబాద్: జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ క్రికెట్ లో తన టాప్ ఫామ్ కొసాగిస్తున్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్ లో ఈ ఆల్ రౌండర్ అదే పనిగా చెలరేగుతున్నాడు. బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ, బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ జట్టు విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నాడు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రజా అద్భుతంగా రాణించాడు.
రెండు మ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీ చేసి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (296)ను వెనక్కి నెట్టి రజా (302) టాప్ కు చేరుకున్నాడు. మూడో స్థానంలో మహమ్మద్ నబీ, నాలుగో స్థానంలో మెహదీ హసన్ మిరాజ్ ఉన్నారు. టీమిండియాలో రవీంద్ర జడేజా 9 వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో కూడా రజా దూసుకొచ్చాడు. 9 స్థానాలు ఎగబాకి 22 వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటర్ల జాబితాలో గిల్, రోహిత్ టాప్-2లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.