అందమైన నిజం అజంతా

భారతీయ పురాతన కళాకుంచె ఇంత అందమైనదా అని ఆశ్చర్యపరిచే కళా స్థావరం అజంతా గుహలు. ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద ఉన్నాయి. వాఘర్‌ నదికి ఉత్తరం పక్క గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండ తొలిచి, గుహలుగా మార్చి ఆ గుహల్లో బౌద్ధమతానికి సంబంధించిన బౌద్ధ విగ్రహాలని, బౌద్ధమత సంబంధ కథలు, జాతక కథలు, చిత్రాలుగా, శిల్పాలుగా చెక్కారు. అక్కడ సుమారు 36 గుహలుండగా అందులో కొన్ని హీనాయాన అనే మొదటి దశ బౌద్ధం, మహాయానం అనే రెండవ దశ బౌద్ధ నిర్మాణాలు కనిపిస్తాయి. బౌద్ధమతానికి సంబంధించిన కళా ప్రయాణంలో ఈ అజంతా ఒక మైలు రాయి. ఇక్కడ క్రీ.పూ. 2వ శతాబ్దంలో మొదటిదశ, క్రీ.శ. 5వ శతాబ్దంలో రెండవ దశ నిర్మాణం జరిగింది. ఈ గుహలపై ఎంతో మంది పరిశోధకులు ఎన్నో రకాలుగా ఆలోచనలు ప్రకటించినా, వాల్టర్‌స్పింక్‌ అనే కళా చరిత్రకారుడి పరిశోధనలని ప్రమాణంగా తీసుకున్నారు.
ఎన్నో యుగాల క్రితం అగ్నిపర్వతాలు బద్దలై పేరుకున్న లావా కొండలుగా ఏర్పడింది. ఆ కొండలు పొరలుపొరలుగా ఏర్పడినాయి. ఈ అజంతా చెక్కిన కొండలూ అవేను. అందువల్ల చాలా చోట్ల ఈ చెక్కిన పొరలు విరిగిపడిపోయినవి. చెక్కుతున్నపుడు కూడా వారికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు అని కూడా మనం ఆ గుహలను చూసి ఊహించవచ్చు.
246 అడుగుల పొడవున్న ఈ కొండలో మొదట శాతవాహన రాజులు చెక్కించిన గుహలు క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవి. ఇది హీనాయాన బౌద్ధ ప్రమాణ సమయంగా అక్కడి చెక్కడాలు కనిపిస్తాయి. ఇందు బౌద్ధ భిక్కులుండే చైత్యాలు, బుద్ధ దేవ ఆరాధనా నిర్మాణాలైన విహారాలు వేరువేరుగా ఉంటాయి. అదే తరువాత నమ్మిబన మహాయాన దశలో చైత్యాలు, వాటి మధ్యనే వెనుక గోడలో విహారాలు ఉంటాయి. భిక్కుల నివాస గదులు, మందిరమూ అన్నీ ఒక పెద్ద హాలులోకి తెరుచుకుంటాయి. వర్షాకాలంలో ప్రయాణాలు చేయకుండా నిలకడగా నివసించటానికి భిక్కులకే కాదు, అన్ని దిక్కులకూ ప్రయాణించే వ్యాపారస్థులకూ, తీర్థయాత్రలు చేసే వారికీ ఇది మజిలీలుగా ఆదుకునేవి. ఈ అజంతా గుహల గురించి మధ్య యుగంలో ప్రయాణాలు చేసిన హుయాన్‌త్సాంగ్‌ వంటి చీనీ బౌద్ధ ప్రయాణీకులు, అలాగే అబుల్‌ ఫజల్‌ 16వ శతాబ్దంలో రాసిన అయినా అక్చరీలోనూ రాశారు. ఈ గుహలు చాలా కాలం రాకపోకలు లేక అడవిలా పెరిగిన చెట్లతో మట్టితో కప్పబడిపోయాయి. 1819లో జాన్‌స్మిత్‌ అనే బ్రిటీషరు వేట కోసం అటు వెళ్లి 10వ నంబరు గుహ వద్ద అక్కడ ఏదో నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించినాక, ఈ గుహల తవ్వకాలు జరిగాయి.
9, 10, 12, 13, 15 ఎ సంఖ్యలున్న గుహలు క్రీ.పూ. 100 నుంచీ క్రీ.శ. 100 మధ్య నిర్మించబడ్డాయి. ఇది శాతవాహనుల రాజ్యంచేసిన కాలం. ఈ ప్రాంతం వారి రాజ్యపరిధిలోని భాగం. వీరు నిర్మాణం చేసిన బౌద్ధ స్థూపాలల్లో స్థూపానికి ప్రాధాన్యం ఇస్తారు. అదే కదా అమరావతి స్థూపం గురించి మాట్లాడినపుడు మనం గమనించింది. వీరి ఈ గుహలు మొదటి భాగపు కట్టడాలైతే, హరిసేనుడనే వాకాటక రాజు కట్టించిన క్రీ.శ. 5వ శతాబ్దపు గుహలు 2వ దశ కట్టడాలు. క్రీ.శ. 2 నుంచీ క్రీ.శ. 5 వ శతాబ్దం వరకూ ఏ నిర్మాణాలూ జరగ లేదు అనేది వాల్టర్‌ స్పింక్‌ వాదన. కానీ ప్రయాణీకుల రాక పోకలు ఈ గుహలకు సాగుతూనే ఉన్నా యట. రెండవ దశలోని గుహలు 1, 8, 11, 14, 29, 19, 26 నిర్మిం చినవి. అంతేకాదు పాత గుహల మీద మృతులు కూడా ఈ సమయంలో జరిగాయి. హరిసేనుడితో పాటూ అతని మంత్రి వరాహదేవుడు, సామంతుడు ఉపేంద్ర గుప్తుడు కూడా కొన్ని కట్టడాలకిక్కడ దాతలయ్యారు. హరిసేనుడి మరణం తర్వాత ముఖ్యమైన కట్టడాలు ఆగిపోయినా, కొంతమంది పురప్రముఖులు, దాతలు కూడా మరికొన్ని నిర్మాణాలు చేయించారు. ఆ 5వ శతాబ్దంలోనే అన్ని కట్టడాలు ఆగినాయి.
ఇక అక్కడ గుహలలో చెక్కిన శిల్పం, చిత్రించిన చిత్రాలు చూస్తే తెలిసేది భారతీయ కళా ప్రపంచపు స్వర్ణయుగంలో అజంతా ఒక ముఖ్యమైన ప్రాంగణం అని. బౌద్ధం వల్ల భారతంలో మిగిలిన కట్టడాలు శిల్పాన్ని అలంకరించుకుంటే, ఈ అజంతా బౌద్ధ అలంకారానికే కలికితురాయి. ఈ గుహల్లో సుమారు 200 శిల్పాలు, 300 చిత్రాతు ఉన్నట్టు అంచనా. గుహల్లోని గోడలు, స్తంభాలు, పైకప్పు చిత్రించబడ్డాయి. కొన్ని గుహలు ఒక్క శిల్పాలను మటుకే కలిగి ఉన్నాయి. ఈ కొండ గుహల వరుస గుర్రపు నాడాలా తిరిగిన మలుపు. 15, 16 గుహల ద్వారం వద్ద ఇక్కడ ఏనుగులు, రక్షకభటులలా నాగదేవతలను చెక్కి అజంతాకే సింహ ద్వారంలా కనిపిస్తాయి ఈ మలుపులోని శిల్పాలు. అజంతా గుహలలో జాతక కథల (బుద్ధుడి పూర్వజన్మ) చిత్రాలు, బౌద్ధ దేవతల చిత్రాలలో కనిపించటం కాక, ఆనాటి సామాన్య మానవుల జీవనం చూపే చిత్రాలు కూడా కనిపిస్తాయి. భౌతిక అందాల చూపే కొన్ని మానవ చిత్రాలు చూసినపుడు ఈ గుహలు భగవ తారాధన కోసం నిర్మించిన గుహలేనా అనే అనుమానం రాక మానదు.
1వ నంబరు గుహ హరిసేనుడు కట్టించిన గుహ. ఇందులో జాతక కథలు అన్నీ ఒక రాజుగా పూర్వ జన్మలలో బుద్ధుడి జీవితాన్ని వివరించే కథలే కనిపిస్తాయి. జాతక కథలలో జంతువుల కథలూ ఉన్నాయి కానీ, అవి ఈ గుహలో కన్పించవు. బహు:శ హరిసేనుడు తనను రాజుగా, పుణ్యపురుషుడిగా చూపించు కోదలచి అలా వేయించి ఉండవచ్చు. 1, 2, 15, 17 హరిసేనుడి (క్రీ.శ. 5) కాలానివే. కానీ 1, 2 గుహలలో కన్పించే చిత్రాలు గీసిన పద్ధతి, 16, 17 గుహలలో చిత్రాలు గీసిన పద్ధతి వేరుగా ఉంటుంది. కనీసం రెండు రకాల చిత్రకారుల సంఘాలు ఇక్కడ పనిచేసాయి అని చెప్పవచ్చు. ఒకటి మాత్రం నిజం అక్కడ పనిచేసిన చిత్ర, శిల్పకారులందరూ, అందెవేసిన చేయి, నైపుణ్యం కలవారు. అంటే దాని వల్ల అర్థమయ్యేది ఈ గుహలు కట్టించిన దాతలందరూ ఎంతో శ్రద్ధగా కట్టించినవి ఈ అజంతా గుహలు.
1వ గుహ 12 స్తంభాలపై నిలుచున్న చతురస్రపు హాలులో వెనుకవైపు ధర్మచక్ర ప్రవర్తనలో కూర్చుని ఉన్న బుద్ధ విగ్రహం, గోడలపై, పై కప్పుపై జాతక కథలు, బోధిసత్వుడు, గౌతమ బుద్ధుడి కథలతో పాటూ, నిజరూపాలకంటే పెద్దవిగా చిత్రించిన చేతిలో కమలంతో పద్మపాణి, వజ్రాయుధంతో వజ్రపాణి బుద్ధుడి మందిరానికి ద్వారపాలకులలా నిల్చుని కన్పిస్తారు. మనం విరివిగా బయట ఎన్నో చోట్ల చూసే చిత్రాలు ఇవేను. పద్మపాణి చిత్రంలో కచ్ఛపవీణ పట్టుకున్న కిన్నెరుడూ కనిపిస్తాడు. ఈ గుహలలోని జాతక కథలల్లో సిబి చక్రవర్తి కథ, శంఖపాల, మహాజనక, చాంపెచయ్య, నంద వంటివి కొన్ని ముఖ్యమైనవి.
2వ గుహలో ఒక వింతైన చిత్రం కనిపిస్తుంది. కొంతమంది పాఠశాలలో పిల్లలు, ముందు వరుసలో కూర్చుని శ్రద్ధగా పాఠాలు వింటున్నట్టుచ వెనుక వరుసల పిల్లలు అల్లరి చేస్తూ ఏదో నాటకం వేస్తూ కనిపిస్తారు. ఈ గుహ ఎవరైనా స్త్రీ దానం ఇచ్చి కట్టించి ఉండవచ్చనీ, బహు:శ హరిసేనుడి బంధువులై ఉండవ్చనీ ఊహ. ఈ గుహలో ఎక్కువగా స్త్రీ సంబంధ కథల చిత్రాలతో పాటూ, జంతువులు, వనాలు, జాతక కథలలో హంస, విదుర పండిత, రురు, క్షాంతి జాతక, పూరణ అవధాన కథలతో పాటూ మాయాదేవి స్వప్నం చిత్రాలుగా కనిపిస్తాయి. మనకు బయట అజంతా చిత్రా లుగా కాపీ చేయబడ్డ చిత్రాలు ఎక్కువగా ఈ గుహలోవే. 1వ గుహ రాజుల కథలుగా, 2వ గుహ రాణుల కథలుగా దిద్దబడింది.
6వ గుహ వంటి రెండం తస్థుల గుహలూ కనిపిస్తాయి. 5, 6 గుహల వంటి ముఖ్య ద్వారాలు కొన్ని ఎంతో అద్భుతంగా చెక్కబడి మకర తోరణంలా, అప్సరసలతో, ఏనుగులు వంటి ఆకారాల చెక్కడాలతో అందంగా కనిపిస్తాయి. 6వ గుహలో ఒక భక్తుడు మోకాళ్లపై కూర్చుని బుద్ధుడి పాదాల వద్ద నమస్కరి స్తున్నట్టు కనిపిస్తాడు. అంటే ఆ నాటికే భక్తి మార్గం పద్ధతి కనిపి స్తుంది. 7వ గుహలో ఎడమ గోడపై 25 కూర్చున్న బుద్ధ రూపాలు, కుడి గోడపై 58 కూర్చున్న బుద్ధ రూపాలూ చెక్కబడి ఉన్నాయి. ఒక్కో బుద్ధుడు ఒక్కో ఆసనంలో కనిపిస్తాడు. కొన్ని గుహలలో అందమైన ఆభరణా లతో ఆకారాలు చిత్రించబడ్డాయి. రూపాలు నిజ స్వరూపాలలాగా కనిపించేట్టు తిప్పిన కుంచెలివి. ఈ గుహలలో ఆనాటి ఆర్థిక సామాజిక పరిస్థితులు అర్థం చేసుకునే విషయ సూచన కన్పిస్తుంది. ఇక్కడి చిత్రాలలో కొంతమంది విదేశీయుల చిత్రాలూ కనిపిస్తాయి. గ్రీకు, పరిషియా, శక, పెహలవ, కుషాన, హూణులు వంటి విదేశీయులు ఇక్కడి పర్యాటకులగానో, వ్యాపార రీత్యానో వచ్చి ఉండవచ్చు.
అజంతా నిర్మించినపుడు హిందూ బౌద్ధ రెండు ధర్మాలూ ప్రచారంలో ఉండేవి. వాకాటికులు హిందువులు. ఏది ఏమైనా కళలను ఆరాధించగల సమాజం, అన్ని నమ్మకాలపై పై మెట్టు కళాపిపాస అని చెప్పగల చిత్రం, శిల్పం అజంతావి.

– డాపప ఎం.బాలమణి, 8106713356

Spread the love