– సీఎం కేసీఆర్ సంకల్పం
– సమాచార, పౌర సంబంధాలశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంధత్వ రహిత తెలంగాణయే సీఎం కేసీఆర్ సంకల్పమనీ, ఆ మేరకు రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నదని సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ తెలిపారు. ఆదివారం కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,533 ప్రాంతాల్లో కంటివెలుగు శిబిరాలకుగాను, గ్రామీణ ప్రాంతాల్లో 12,768, పట్టణప్రాంతాల్లో 3,788 ఉన్నాయని చెప్పారు. రెండవ విడత కంటివెలుగు లో ఇప్పటివరకు 12,79,637 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, వారిలో దృష్టి లోపం వున్న 2,94,892 మందికి కండ్లద్దాలు, మరో 2,05,305 మందికి కండ్లద్దాలకై ప్రిస్క్రిప్షన్ రాశారు. శిబిరాల్లో ఇచ్చిన కండ్లద్దాలతో మురిసిపోతున్న లబ్ధిదారులు…ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో 63 ఏండ్ల రాములమ్మకు పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నట్టు గుర్తించారు. మైనస్ 5 పాయింట్ల దష్టిలోపం వచ్చేంత వరకు తనను ఆస్పత్రికి తీసుకెళ్లలేదనీ, సీఎం కేసీఆర్ వల్లే తనకు ఇంటి వద్దకే పరీక్షలు వచ్చాయని ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.