– ఎన్‌ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ పిలుపు
నవతెలంగాణ – హైదరాబాద్
అక్టోబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రాంలీలా మైదానంలో పాతపెన్షన్ సాధన కోసం శంఖారావం పూరిస్తామనీ, భారీ బహిరంగసభను నిర్వహిస్తామని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. జూన్ ఒకటి నుంచి పాత పెన్షన్ స్కీమ్ కోసం జాతీయ ఉద్యమం క్విట్ ఇండియా రథయాత్రను భారతదేశమంతా నిర్వహిస్తామని వివరించారు. ఆగస్టు ఒకటి నుంచి తొమ్మిది వరకు పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ‘ఘంటి బజావో- పెన్షన్ దిలావో’అంటూ ఎంపీ/ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను సమర్పించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఆదివారం ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పీఎఫ్‌ఆర్డీఏ చట్టాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తూ ఉద్యోగుల సొమ్మును కార్పొరేట్ల పాలు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చినా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్‌ఆర్డీఏ చట్టం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత చేకూరడం లేదంటూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నాయని వివరించారు. బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం లేదన్నారు. ఇటీవల జరిగిన హర్యానాలో ప్రజాస్వామ్యయుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై లాఠీఛార్జ్ చేయడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. 2024లో వచ్చే లోక్‌సభ సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యమ కార్యాచరణను రూపొందించామన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో వచ్చేనెల 16న పెన్షన్ రాజ్యాంగ మార్చ్‌ను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేస్తామని అన్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.