– సింగపూర్ కంపెనీకి సంబంధాలు : హిండెన్‌బర్గ్
న్యూఢిల్లీ : అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ మరో బాంబు పేల్చింది. దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసుతో అదానీ గ్రూపునకు సంబంధాలున్నాయని పేర్కొంది. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్, రెండవ అనుబంధ ఛార్జిషీట్‌లోనూ చేర్చిన సింగపూర్‌కు చెందిన కంపెనీ అదానీ గ్రూప్ సంబంధిత సంస్థ అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. కాగా.. 2018లో ఈడీ దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌లో అనూహ్యాంగా ఆ పేరును తొలగించారని వెల్లడించింది. సింగపూర్‌లోని అధికారులు పంపిన లేఖ ఆధారంగా ఆ స్కామ్ నుంచి పేరును తొలగించారని సమాచారం. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న గుడామి ఇంటర్నేషనల్ పీటీఈ సంస్థ అదానీ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ సంబంధిత విషయం అనుకోకుండా బయటకు వెళితే నిధుల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని తెలిపారు. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం తలెత్తిన పరిస్థితులపై సెబీ సహా ఇతర అత్యున్నత సంస్థలు దర్యాపు చేస్తున్నాయని వివరించారు. హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తు జరపాలని కోరుతూ విశాత్ తివారీ, మనోహర్‌లాల్ శర్మ లు వేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 10న విచారణ జరిపింది. ఈ ధర్మాసనంలో సీజేఐ చంద్రచూడ్‌తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జె.బి పార్ధివాలలు ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో లక్షల కోట్ల రూపాయలు ఆవిరి కావడంపై కోర్టు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. భారత మదుపరులను రక్షించాల్సి ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది. రెగ్యులేటరీ ప్రక్రియపై కేంద్రం, సెబీ అభిప్రాయాలను కోరింది. దీనిపై విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో నిపుణుల కమిటీని వేయాలని సూచించింది. దీంతో ఈ వేర్వేరు పిటిషన్లపై సోమవారం కొనసాగిన విచారణలో కమిటీ ఏర్పాటుకు కేంద్రం తన సమ్మతిని తెలిపింది.