అచ్చ తెలుగు భోజనంలాంటి సినిమా


దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ-హైబ్రిడ్‌ అల్లుడు’. డా. రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌, మృణాళిని జంటగా నటిస్తున్నారు.
తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ, హరిణి ఆలపించిన తొలి లిరికల్‌ ‘అల్లసాని వారి అల్లిక’ సాంగ్‌ విడుదల కార్యక్రమం నిర్మాత సి. కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎఫ్‌.ఎన్‌.సి.సిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు వి.వి.వినాయక్‌ విచ్చేసి, ఫస్ట్‌ లిరికల్‌ను లాంచ్‌ చేశారు. ఈ సాంగ్‌ ‘సరిగమలు’ ద్వారా అందు బాటులో ఉంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు, నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ,’ఈ సాంగ్‌ వినడానికి ఎంత మెలోడియస్‌గా ఉందో, పిక్చరైజేషన్‌ అంతకు మించి అందంగా ఉంటుంది. ఈ సినిమా కృష్ణారెడ్డి రెగ్యులర్‌ స్టైల్లో ఉంటూనే నేటి యంగర్‌ జనరేషన్‌ను ఆకర్షించే అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కింది’ అని తెలిపారు. హీరో సోహెల్‌ మాట్లాడుతూ, ‘కృష్ణారెడ్డి సినిమాలో హీరోగా నటించడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ‘నో కాంప్రమైజ్‌ అనే కల్పన డేరింగ్‌నెస్‌ ప్రతిఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. నా గత చిత్రాల్లోన్ని అన్ని అంశాలు.. అంతకు మించి ఈ చిత్రంలో పొందు పరిచి మిమ్మల్ని అలరించ డానికి వస్తున్నాం. అందర్నీ కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాం ‘ అని దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.
‘మా గురువు దాసరి బర్త్‌డేని మేం అందరం మా బర్త్‌డేగా ఫీలవుతాం. ఈరోజు ఆయన లేరు కాబట్టి ఆయన్ను తలుచుకుంటూ ఈ బర్త్‌డే చేసుకుంటున్నా. ఈ సినిమా అరిటాకులో వడ్డించిన అచ్చతెలుగు భోజనం. దీని పనిచేసిన టెక్నీషియన్స్‌ అందరూ కేవలం తెలుగు వారే. కృష్ణారెడ్డితో మా కల్పన తొలి స్ట్రెయిట్‌ ప్రొడక్షన్‌ చేయడంతోనే సగం సక్సెస్‌ కొట్టేసింది. తెలుగు సినిమా చరిత్రలో మీ పేరు మారుమోగి పోయే ఒక ప్రాజెక్ట్‌ చేయండి అని ఆమె ఇచ్చిన సలహా మేరకే బాలయ్యతో ‘రామానుజాచార్య’ భారీగా నిర్మించబోతున్నాను.
– నిర్మాత సి. కల్యాణ్‌

Spread the love