అత్యంత చిన్నవయసులోనే…

            మన దేశ స్క్వాష్‌ ఛాంపియన్‌ అనాహత్‌ సింగ్‌ 2022లో జరిగిన ఈవెంట్‌లో విజయాన్ని సాధించింది. అండర్‌ 15 బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతో ఆమె అసాధారణ ప్రదర్శన ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకుంది. జోష్నా చిన్నప్ప తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయురాలు ఈమెనే.
బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రతి ఏటా జనవరిలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ కోసం పోటీపడతారు. క్వార్టర్స్‌లో మన దేశానికి చెందిన 14 ఏండ్ల అనాహత్‌ 3-0తో మలేషియాకు చెందిన హర్లీన్‌ టాన్‌పై విజయం సాధించింది. ఆమె తన ఈజిప్టు ప్రత్యర్థి మలక్‌ సమీర్‌ను 3-0తో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్స్‌లో మొదటి సెట్‌ దగ్గరగా ఉన్నప్పటికీ అనాహత్‌ చివరికి ఈజిప్ట్‌కు చెందిన సొహైలా హజెమ్‌పై 3-1 స్కోరుతో విజయం సాధించింది.
జీవితం తొలి దశలో
20008 జనవరి 13న ఢిల్లీలో పుట్టింది అనాహత్‌. గత ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందంలోని అతి పిన్న వయస్కురాలు అనాహత్‌. డిసెంబర్‌ 2022 నాటికి ఆమె బాలికల అండర్‌ 15 విభాగంలో ఆసియాలో అగ్రశ్రేణి క్రీడాకారిణి. అనాహత్‌ ఓ తన ఆరేండ్ల వయసులో బ్యాడ్మింటన్‌ ఆడటం ప్రారంభించింది. అప్పటికే స్క్వాష్‌ క్రీడాకారిడి అయిన తన అక్క అమీరాతో పాటు కలిసి ఆడుతుండేది. స్థానికంగా ఆమె కొన్ని స్క్వాష్‌ టోర్నమెంట్లలో ఆడింది, అక్కడ మంచి ప్రదర్శన ఇచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఆటపై అభిమానాన్ని పెంచుకుంది. ఎనిమిదేండ్ల వయసులో స్క్వాష్‌కు మారింది.
పేరు ప్రఖ్యాతులు
2019 జనవరిలో జరిగిన బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్‌లో బాలికల అండర్‌ U11 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరం జూలైలో డచ్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్‌లో బాలికల U13 టైటిల్‌ను గెలుచుకున్న ఆమె అత్యంత పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. 2021, సెప్టెంబర్‌ 4-7 సమయంలో జరిగిన HCL SRFI ఇండియన్‌ టూర్‌ – నోయిడాలో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా ఆమె 2021-22 PSA వరల్డ్‌ టూర్‌లో కూడా భాగమైంది.
ప్రత్యేక శిక్షణ లేదు
ఈ ఏడాది జనవరిలో మలేషియాకు చెందిన హర్లీన్‌ టాన్‌పై విజయం సాధించిన ఆమె ఓ వెబ్‌ పత్రికతో చేసిన ప్రత్యేకమైన చాట్‌లో కష్టపడి సాధించిన విజయం గురించి మాట్లాడుతూ ”నేను బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. నవంబర్‌ ప్రారంభంలో కొరియాలో ఆసియా సీనియర్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లు, డిసెంబరులో చెన్నైలో సీనియర్‌ నేషనల్స్‌తో సహా అనేక ముఖ్యమైన టోర్నమెంట్‌లు గత సంవత్సరం నిర్వహించబడ్డాయి. నేను వాటి కోసం శిక్షణ పొందాను. అదే నన్ను స్కాటిష్‌ జూనియర్‌, బ్రిటిష్‌ జూనియర్‌ స్థాయిలకు తీసుకువెళ్లింది.
ప్రతి క్షణం భిన్నమే
ఈ యువ ఛాంపియన్‌ గతంలో బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ (BJO) టైటిల్‌ కోసం కొన్ని సంవత్సరాల కిందట పోటీపడి గెలిచింది. ”నేను రెండుసార్లు (BJO) ఫైనల్స్‌కు చేరుకున్నాను, 2019లో గెలిచాను. కాబట్టి పోటీ గురించి బాగా తెలుసు. ఇది జూనియర్‌ సర్క్యూట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌లలో ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరూ పోటీపడి గెలవడానికి చాలా కష్టపడి శిక్షణ పొందుతారు. ప్రతి క్షణం ఇక్కడ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్ళు భిన్నంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ దాని కోసం శిక్షణ పొందారు. ఏ ప్రత్యర్థిని తేలికగా తీసుకోలేము, మన అత్యుత్తమ ప్రదర్శన చూపాల్సిందే” అంటుంది. తఅనాహత్‌ ఇప్పుడు తను రాబోయే టోర్నమెంట్‌ల గురించి ఉత్సాహంగా ఉంది. ఆమెకు లైనప్‌లో చాలా మంది ఉన్నారు. ”నేను ఎదురు చూస్తున్న తదుపరి టోర్నమెంట్‌ ఆసియా జూనియర్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌. ఇది 2023 ఫిబ్రవరి 8 నుండి 12 వరకు చెన్నైలో జరుగుతుంది” అని ఆమె తన మాటలు ముగించింది.

Spread the love