పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది.ఈ చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘అవసరాలకి ఇది మూడో సినిమా. ఆయనతో నాకిది మూడో సినిమా. కానీ నాకు మాత్రం ఇది 23వ సినిమా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ద్వారానే నేను ప్రేక్షకులకు ఇంత దగ్గరయ్యాను. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ఎలాగైతే గుర్తుండిపోతాయో.. ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ నా జీవితంలో చేయలేను’ అని చెప్పారు. ‘టైటిల్‌ని బట్టే మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఇది మీ ప్రేమ కథ అయ్యుండొచ్చు. మీ స్నేహితుల ప్రేమ కథ అయ్యుండొచ్చు. కానీ ఈ సంజరు, అనుపమల ప్రేమకథ చూడటం ఇంకా ఎక్కువ మజా వస్తుంది. ఎందుకంటే ఇది శ్రీనివాస్ గారి మ్యాజిక్. ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ అని నాయిక మాళవిక నాయర్ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ, ”ఇది టీమ్ అంతా కలిసి చర్చించుకుని తీసిన సినిమా. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీశాం. సినిమాటిక్ డైలాగ్స్‌తో స్క్రిప్ట్‌ని రాయకుండా.. నిజ జీవితంలో వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అలా సహజ సంభాషణలతో తీసిన సినిమా ఇది. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథ లాంటిది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరం కలిసి ఒక టీమ్‌లా పనిచేశాం’ అని చెప్పారు.