అదాని పుట్ట పగిలి… జనం పుట్టి మునిగి..

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ సంస్థల బండారం బట్టబయలైంది. హిండేన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ బయటపెట్టింది అదానీ బాగోతమే కాదు ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ అక్రమాల అసలు మతలబుని. రెండు రోజుల్లో 4,18,000 కోట్ల మేర అదాని సంస్థల సంపద ఆవిరైంది. అసాంఖ్యాక ప్రజల, ఎన్నో సంస్థలకి నమ్మక ద్రోహం చేసిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానిది ప్రధాన భూమిక. మూడు దశాబ్దాల్లో ప్రపంచ మూడవ కూబేరుణ్ణి చేసిన ఘనత కచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వానిదే. రెగ్యులేటరీ నిబంధనలను సవరింపజేసి, పెన్షన్‌, ప్రావిడేంట్‌ ఫండ్‌ను, ప్రభుత్వ రంగాలైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి దిగ్గజాలతో పెట్టుబడులు పెట్టించిన ప్రభుత్వం ప్రధాన బాధ్యురాలేనని నిపుణులు అభిప్రాయపడు తున్నారు. అయితే ఈ సీక్రెట్‌ వ్యవహారా లకు ఆశ్రిత విధానాలతో స్టాక్‌ మార్కెట్టూ అదానీకిబాగా ఉపయోగపడ్డాయి, ఒక్క వార్త వేలకోట్ల సామ్రాజ్యాన్ని పేక మేడలా కూలేటట్లు చేయగల సామర్థ్యం స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత వ్యవస్థకు మాత్రమే సాధ్యం. ప్రపంచ కుబేరుడు గౌతమ్‌ అదాని వ్యాపార వ్యవహారాలపై హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన ఒక దర్యాప్తు నివేదిక వారి సామ్రాజ్యానికి బీటలు వారేలా చేసింది. కుబేరుల్లో మూడు నుంచి ఏడవ స్థానానికి రెండు రోజుల వ్యవధిలోని పడిపోయినట్లు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైనట్లు వార్తా మాధ్యమాలన్నీ గొల్లుమన్నాయి. అయితే కూలిపోయిన అదాని పేక మేడకు ఆశపడి రాళ్ళెత్తిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు, వ్యక్తిగత మదుపుదారులందరూ కన్నీళ్లు కార్చడం తప్ప వేరే దారి లేదు. దీని పర్యవసానంగా అదాని గ్రూపులో పెట్టుబడులు పెట్టిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కంపెనీల వాటాలన్నీ కూడా పడిపోతున్నవి. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ వంటి సంస్థల వాటాలు కూడా వేలకోట్ల నష్టాలు చవిచూశాయని వార్తలున్నాయి. ఇలాంటి సంస్థల కన్నా వ్యక్తిగత మదుపుదారులే భయాందోళనకు గురై అమ్ముకున్న కారణంగా చాలా నష్టపోయారు. షేర్లలో అవకతవకలకు, అకౌంట్స్‌లో మోసాలకు, మనీలాండరింగ్‌కు అదానీ గ్రూపు పాల్పడిందన్నది హిండెన్‌బర్గ్‌ నివేదిక సారాంశం. ఆ రిపోర్టులో లేవనెత్తిన పలు అంశాలు, ప్రశ్నలపై అదానీ సమాధానం చెప్పకుండా, తమను దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని ఎదురుదాడి చేశారు. ప్రతిగా తమ నివేదికపై కట్టుబడి ఉన్నామని, ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హిండెన్‌బర్గ్‌ చేసిన సవాల్‌పై అదానీ వైపు నుంచి స్పందన శూన్యం.
పైకి రోల్‌మోడల్స్‌గా కనిపించే కార్పొరేట్ల చీకటి దందాలు హిండెన్‌బర్గ్‌ నివేదికతో మరోసారి బహిర్గతం అయ్యాయి. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీల షేర్లను తిమ్మినిబమ్మిని చేసి కత్రిమంగా ధరలు పెంచుకున్నారు. ఆ షేర్లను తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి అడ్డగోలుగా అప్పులు తెస్తున్నారు. అందినకాడికి పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉన్న సింగపూర్‌, మారిషస్‌, కరీబియన్‌ దీవులు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి లాభాలను వాటిలోకి మనీలాండరింగ్‌ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇటువంటి అక్రమాలతోనే అదానీ గ్రూపులోని షేర్లు ఎకాయికిన 819 శాతం పెరిగాయి. నికర విలువ 231 శాతానికి ఎగబాకింది. మూడేళ్ల క్రితం గ్రూపు వర్త్‌ రూ.1.62 లక్షల కోట్లు కాగా ఇప్పుడు 9.78 లక్షల కోట్లు. ఈ స్వల్ప సమయంలో 8.1 లక్షల కోట్లు పెరగడం అసాధారణం. కరోనా విలయంతో ప్రజలు అల్లాడుతుండగా అదానీ సంపద అనూహ్యంగా పెరిగింది మోసాల నిచ్చెనతోనేనన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదు. హిండెన్‌బర్గ్‌ పేల్చిన బాంబుతో అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. రూ.వేల కోట్ల విలువైన సంపద ఆవిరైంది. షేర్‌ మార్కెట్‌లో సంపద గాలి బుడగ అనడానికి ఇదొక ఉదాహరణ. అదానీ గ్రూపులోని షేర్లలో 85 శాతం కుప్పకూలతాయని హిండెన్‌బర్గ్‌ చేసిన హెచ్చరికకు తాజా పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.
హిండెన్‌బర్గ్‌ నివేదిక అదానీకో లేదంటే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకో పరిమితం కాదు. మోడీ ప్రభుత్వానికీ పెద్ద కుదుపు. అదానీ-మోడీ మధ్య అవినాభావ సంబంధం బహిరంగం. 1988లో చిన్న ఎగుమతి, దిగుమతి కంపెనీతో వ్యాపారం ప్రారంభించిన అదానీకి 1991 నుంచి దేశంలో ప్రారంభమైన సరళీకరణ విధానాలు ఊపునిచ్చాయి. గుజరాత్‌ సిఎంగా మోడీ వచ్చాక అదానీ ప్రభ వెలిగింది. మోడీ దేశ ప్రధాని అయ్యాక అదానీ వాణిజ్య సామ్రాజ్యం అవధులు దాటింది. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వే, రోడ్డు, విద్యుత్‌, గ్యాస్‌, బొగ్గు, రియల్‌, ఒకటేమిటి… సకలం అదానీ వశమవుతున్నాయి. కేంద్ర బిజెపి ఆశ్రితపక్షపాతం లేకుండా అదానీ ఇంతగా ఎదగడం అసాధ్యం. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లోనూ అదానీ చక్రంతిప్పడానికి మోడీ సర్కారే కారణం. డ్రగ్స్‌ అక్రమ రవాణాకు అదానీ పోర్టులు కేంద్రాలుగా మారాయని వెల్లడైంది. ఇంతకుముందు అక్రమాలకు సంబంధించిన కేసులలో అదానీ కంపెనీలపై సెబి నిషేధం విధించగా, దానిని జరిమానా కింద మార్పించుకుని అదానీ బయట పడ్డారు. సెబి, ఆర్‌ఒసి, ఇడి, సిబిఐ, నిఘా సంస్థలు కొమ్ము కాస్తున్నందునే అదానీ మార్కెట్‌ మాయాజాలం సక్సెస్‌ అయింది. ఇప్పటికైనా హిండెన్‌బర్గ్‌ రిపోర్టుపై కేంద్రం అదానీ ఆర్థిక అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తుందో లేదో వెండితెరపై చూడాల్సిన బొమ్మే!

Spread the love