అదానీ అవకతవకలపై సెబి, ఈడీ విచారణ జరపాలి

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అదానీ సంస్థల షేర్ల అవకతవకలకు సంబంధించి హిండెన్‌ బెర్గ్‌ ఇచ్చిన నివేదికపై సెబి, ఈడీ వంటి సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నేరం రుజువైతే తక్షణమే అదానీని అరెస్టు చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. దేశ ప్రజల్లో ఈ అంశాలపై అనుమానాలున్నాయనీ, వాటిని నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేయాలని కోరారు. ప్రధాని మోడీ ఈ మోసాలకు నైతిక బాధ్యత వహించి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ నివేదిక వెలువడిన తర్వాత వరుసగా రెండు రోజులపాటు అదానీ సంస్థల షేర్లు, అందులో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థల షేర్లు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర భారీగా పతనం కావడం ఆందోళన కలిగిస్తున్నదని వివరించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ సంపద అనూహ్య రీతిలో పెరిగి, ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకారని గుర్తు చేశారు. ఇది దేశ చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వ ఆశ్రిత పక్షపాతానికి నిదర్శనమని విమర్శించారు. అదానీ షేర్ల డొల్లతనం బయటపడి, రెండు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌ పతనంతో ఎల్‌ఐసీ రూ.18 వేల కోట్లు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెడితే ఏమవుతుందో ఈ ఉదంతం పెద్ద ఉదాహరణని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను వాటి పద్ధతిలో నడవనీయాలనీ, బలవంతంగా షేర్లు కొనుగోలు చేసేలా చేయడం వల్ల ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతాయని పేర్కొన్నారు.

Spread the love