– ఆర్బీఐ వద్ద ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ- సిటీబ్యూరో
అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్ల మెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని నరేంద్రమోడీకి భయమెందుకని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. జేపీసీలో అధికార బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా ఉంటారని, నరేంద్రమోడీ ఎలాంటి తప్పులూ చేయకుంటే ఆ కమిటీని వేయడానికి ఎందుకు వెను కాడుతున్నారని ప్రశ్నించారు. అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని, తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అదానీ ఆర్థిక సామ్రాజ్యం గాలిబుడగ లాంటిదని, అది అవినీతి పునాదులపై నిర్మించిన సామ్రాజ్యమని విమర్శించారు. హిండెన్ బెర్గ్ విడుదల చేసిన నివేదిక తర్వాత అదానీ అవినీతి సంపాదన గుట్టురట్టు అయిందన్నారు. నరేంద్రమోడీ కనుసన్నల్లోనే ఎల్ఐసీ నుంచి రూ.80 వేల కోట్లు, ఎస్బీఐ నుంచి రూ.25 వేల కోట్ల పెట్టుబడులు అదాని కంపెనీలలో పెట్టారని చెప్పారు. అదానీ కంపెనీల కుంభ కోణాలను వెలికితీయాలని ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే, ప్రధాని ఎదురుదాడికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును అదానీ కంపెనీలో ఎలా పెట్టుబడులు పెడతారని, ఇప్పుడు నష్టపోయిన సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దేశ వార్షిక బడ్జెట్ రూ.45 లక్షల కోట్లు ఉంటే, అందులో దాదాపు జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లు వసూలు అవుతున్నాయని, ఆ జీఎస్టీలో పేదవాడు కట్టిన సొమ్మే ఎక్కువ భాగమని చెప్పారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలను క్రమేపి తగ్గిస్తున్నారని, ఆహారం మీద రూ.లక్ష కోట్లు తగ్గించారని, ఎరువులపై రూ.50 వేల కోట్లు. ఇలా మొత్తం సబ్సిడీలను రూ.3 లక్షల కోట్లకు తగ్గించారని వివరించారు. ఈ విధంగా తగ్గించుకుంటూ పేదవాడిని కొట్టి కార్పొరేట్ సంస్థలకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్య మంత్రి కానప్పుడు అదానీ ఎవరో సమాజానికి తెలియదని, అలాంటి వ్యక్తి మోడీ అండదండలతో ప్రపంచ కుబేరులలో స్థానం పొందారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో రూ.30 వేల కోట్లు కోత విధించారని, ప్రజలకు ఇచ్చే సొమ్ముపై కోతలు విధించి, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, ఎన్.బాలమల్లేష్, వీఎస్.బోస్, ఇటి.నర్సింహ్మాలు, సీపీఐ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కార్యదర్శులు పాలమాకుల జంగ య్య, డీజీ.సాయిల్గౌడ్, సీపీిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, ఎ.రవీంద్రాచారి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయనాయక్, బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.