అదానీ కోసం ప్రధాని విదేశీ పర్యటనలు!

– బంగ్లాదేశ్‌తో రూ.14వేల కోట్ల విలువైన విద్యుత్‌ ఒప్పందం
– ‘హిండెన్‌బర్గ్‌’ నివేదిక తర్వాత ఒప్పందంపై బంగ్లాదేశ్‌ అనాసక్తి
– భారత్‌-బంగ్లా సంబంధాలపై ప్రభావం
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో, జనాల్లో ఇటీవల భారత్‌ వ్యతిరేకత ఎక్కువవుతోంది. దీనికి కారణం అధిక ధరతో కూడిన అదానీ కంపెనీ విక్రయించే విద్యుత్‌. మార్కెట్‌ ధరకన్నా ఐదు రెట్లు ఎక్కువ చెల్లించి అదానీ కంపెనీ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి? అని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై 2017లో సంతకాలు అయ్యాయి. ఒప్పందం భారంగా మారిందని, ఇందులో మార్పులు చేయాలని బంగ్లాదేశ్‌ పదే పదే కోరుతోంది. ఈ అంశం భారత్‌పై బంగ్లాదేశ్‌లో వ్యతిరేకతకు దారితీస్తుందని, ఇరు దేశాలకు మంచిది కాదని పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొంతమంది ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ”ప్రధాని మోడీ 2015లో జరిపిన ఢాకా పర్యటనలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదిర్చారు. ఒక బడా కార్పొరేట్‌ కోసం ప్రధాని మోడీ తన శక్తియుక్తులు ఉపయోగించారు. దీనివల్ల పక్క దేశంలో మన గురించి చెడుగా మాట్లాడుకుంటు న్నారు. అదానీ గ్రూప్‌-బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన విద్యుత్‌ ఒప్పందంపై వివరాలు బయటపెట్టండి” అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక ఎంపీ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. భారత్‌లోని బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని, వేల కోట్ల కాంట్రాక్ట్‌లు అప్పగించేందుకు ప్రధాని తన రాజకీయ చిత్తశుద్దిని వెచ్చించారని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ ఒక వార్తా కథనం ప్రచురించింది. రెండు నెలల క్రితమే ఈ వార్తా కథనం వెలువడింది. ఇందులో అదానీ గ్రూప్‌-బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన పీపీఏ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం) 163 పేజీల పత్రాల్ని విశ్లేషించింది. ఢాకా పర్యటనలో రూ.14వేల కోట్లకు పైగా విలువజేసే విద్యుత్‌ కాంట్రాక్ట్‌ అదానీ గ్రూప్‌నకు ప్రధాని మోడీ ఇప్పించారని ఆరోపించింది. ఈ వార్తా కథనం తర్వాత కొంతమంది లోక్‌సభ ఎంపీలు కేంద్రానికి లేఖలు రాశారు. ఈ ఒప్పందం వివరాలు ఇవ్వాలని కోరారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో ఈ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఒప్పందంపై బంగ్లాదేశ్‌ పునరాలోచన
బంగ్లాదేశ్‌ ప్రభుత్వ పెద్దలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై పునరాలోచనలో పడ్డారు. అదానీ పవర్‌ తయారుచేసిన విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని బంగ్లాదేశ్‌ ప్రభుత్వంపై ఆరోపణలు వెలువడ్డాయి. ‘పీపీఏ’ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం)పై ఆ దేశంలో వ్యతిరేకత కనపడుతోంది. ఒప్పందం ప్రకారం నిర్వహణ, ఇతర ఛార్జీల కింద అదానీ గ్రూప్‌నకు బంగ్లాదేశ్‌ ప్రతిఏటా 450 మిలియన్‌ డాలర్లు (రూ.3724 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఒక యూనిట్‌ విద్యుత్‌ మార్కెట్‌ ధరకన్నా ఐదు రెట్లు ఎక్కువకు బంగ్లాదేశ్‌కు భారత్‌ అమ్ముతోందన్న చర్చ సోషల్‌మీడియాలో నెలకొంది. ఈ వ్యవహారం భారత్‌పట్ల తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. అదానీ కోసం ఇదంతా అవసరమా ? అని భారత్‌లోని కొంతమంది ఎంపీలు మోడీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు.

Spread the love