అదానీ వ్యవహారం సెబీకి ఎరుక

– రెగ్యూలేటరీ సంస్థలు చూసుకుంటారు
– ఎఫ్‌పీఓ ఉపసంహరణతో దేశ ప్రతిష్ట పోదు : మంత్రి సీతారామన్‌ వెల్లడి
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల పై వస్తున్న ఆరోపణలు, షేర్ల పతనం వ్యవహారంలో రెగ్యూలేటరీ సంస్థలు వాటి పని అవి చేస్తాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆ అంశాన్ని రెగ్యూలేటరీ సంస్థలే చూసు కుంటాయన్నారు. అదానీ విషయంలో శుక్రవారం ఆర్‌బిఐ ప్రకటన విడుదల చేసిందన్నారు. దీని కంటే ముందూ ఎల్‌ఐసి, బ్యాంక్‌లు కూడా స్పందించాయని మంత్రి పేర్కొన్నారు. శనివారం ముంబయిలో ‘పోస్ట్‌ బడ్జెట్‌’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్నారు. ఆర్థిక, బ్యాంకింగ్‌, స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థలు ప్రభుత్వాధీనంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నారు. కీలకమైన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ సంస్థలకే వదిలేద్దా మన్నారు. ఆ పరిస్థితులను సెబీ దగ్గరుండి పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన కొన్ని షేర్ల ట్రేడింగ్‌పై ఎన్‌ఎస్‌ఇ ఆంక్షల విధింపునపై మంత్రి సమాధానాలు దాటేశారు. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పిఒను ఉపసంహరించుకోవడం ద్వారా దేశ ప్రతిష్ట ఏమి పడిపోదన్నారు. గతంలోనూ పలు కంపెనీలు ఎఫ్‌పీఓలను ఉపసంహరించుకున్నాయన్నారు. స్టాక్స్‌లో అదానీ గ్రూప్‌ మోసాలకు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలతో ఆ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లలో అసాధారణ పతనాన్ని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.
రూ.1000 కోట్లకు హిండెన్‌బర్గ్‌ గండి..!
రూ.1000 కోట్ల నిధుల సమీకరించాలన్న యోచనను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిలిపివేసిందని సమాచారం. ఇందుకు హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌, అదానీ షేర్లలో తీవ్ర ఒడిదుడుకే ప్రధాన కారణమని తెలుస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌, బాండ్ల ధరలు తగ్గిపోయాయి. బాండ్లు జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని తొలుత నిర్ణయించుకున్న ఆ కంపెనీ.. తర్వాత ప్రణాళికను ఉపసంహరించుకుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇటీవల రూ.20 వేల కోట్ల విలువైన ఎఫ్‌పిఒను కూడా ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ బాండ్ల విక్రయ ప్రణాళికనూ కూడా నిలిపివేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి.
అధిక అస్థిరతలపై నిఘా : సెబీ
స్టాక్‌ మార్కెట్లలోని పలు కీలక స్టాక్స్‌ల్లో చోటు చేసుకుంటున్న అస్థిరతలపై నిఘా చర్యలు ఉన్నాయని సెబీ శనివారం తెలిపింది. అదానీ గ్రూపు కంపెనీల పేరు ఎత్తకుండా ఓ ప్రకటన చేసింది. స్టాక్‌ మార్కెట్‌ సమగ్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నామని, వ్యక్తిగత షేర్లలో ఏదైనా అధిక అస్థిరతను పరిష్కరించడానికి అవసరమైన అన్ని నిఘా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. గత వారంలో స్టాక్‌లలో అసాధారణ ధరల కదలికను గమనించినట్లు తెలిపింది. అదానీ వ్యవహారం నేపథ్యంలోనే సెబీ ఈ ప్రకటన చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. అదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీలు కేవలం ఒక్క వారంలోనే అమ్మకాల ఒత్తిడితో దాదాపు రూ.9 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయిన విషయం తెలిసిందే.

Spread the love