అదుపులోనే ద్రవ్యోల్బణం

– లోక్‌సభలో ప్రధాని .. అదానీపై నో కామెంట్‌
– మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ప్రధాని మోడీ అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. కానీ దేశంలో

సంచలనం అయిన, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అదానీ వ్యవహారంపై మాత్రం ఆయన స్పందించలేదు. ప్రధాని మోడీ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసిందన్నారు. ఒక పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారనీ, నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని మోడీ అన్నారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం భారత్‌ ఇతరులపైన ఆధారపడేదనీ, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. నేడు భారత్‌ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని అన్నారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చనీ, తనకైతే గర్వంగా ఉన్నదని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని విమర్శించారు. నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయనీ, భారత్‌ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని అన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఈడీ దెబ్బకు ఏకమైన ప్రతిపక్షాలు
దర్యాప్తు సంస్థలపై ప్రతిపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని మోడీ అన్నారు. ఈడీ దెబ్బకు ప్రతిపక్ష నాయకులంతా ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఈడీకి వారు ధన్యవాదాలు చెప్పాల్సిందేనన్నారు. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశాననీ, ప్రజలకు తనపై విశ్వాసం ఉన్నదనీ, అది ప్రతిపక్షాలకు అందదని ప్రధాని చెప్పారు. తాను 125 కోట్ల మంది కుటుంబాల సభ్యుడినని అన్నారు. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారనీ, తాను 125 కోట్ల మంది కుటుంబాలకు సేవ చేస్తున్నానని పేర్కొన్నారు.
ఒకప్పుడు రైల్వే అంటే యాక్సిడెంట్లు గుర్తుకొచ్చేవనీ, నేడు వందే భారత్‌ రైళ్లు చూసి ప్రజలు గర్వపడుతున్నారని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని ఆరోపించారు. దేశంలో ఆ పదేండ్లు రక్తపుటేర్లు పారాయన్నారు. భారత్‌ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
తొమ్మిదేండ్లలో 70 ఎయిర్‌పోర్టులు
దేశంలో 70 సంవత్సరాలలో 70 ఎయిర్‌పోర్ట్‌లు నిర్మిస్తే, తమ ప్రభుత్వం తొమ్మిదేండ్లలోని 70 ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించిందని మోడీ పేర్కొన్నారు. జల మార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరోవైపు మోడీ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు..

Spread the love