అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం

– కొలిశెట్టి వజ్రమ్మ సంస్మరణ సభలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
అమరవీరుల ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కొలిశెట్టి వజ్రమ్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణ ప్రాంతంలో భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి పేద ప్రజల విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ విప్లవపోరాటంలో అనేకమంది అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొలిశెట్టి వెంకయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. పోరాట కాలంలో అనేక ఇబ్బందులు వచ్చిన ప్పటికీ కడవరకు భర్త వెంకయ్యతో కలిసి వజ్రమ్మ పని చేశారని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం కమ్యూనిస్టుగా వజ్రమ్మ జీవించారని చెప్పారు. కుమారుడు కొలిశెట్టి యాదగిరిరావును పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని, పూర్తికాలం కార్యకర్తగా పంపించారని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనన్నారు. జర్నలిస్టు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్‌ మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల త్యాగాల వల్ల నేడు మనమందరం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని చెప్పారు. వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్‌, డీటీఎఫ్‌ జిల్లా నాయకులు దశరథ రామారావు మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనన్నారు. ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది కమ్యూనిజం మాత్రమేనని చెప్పారు. నేటి యువత నాటి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని, అప్పుడే సమసమాజం సాకారం అవుతుందన్నారు. అంతకుముందు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చెరుకు ఏక లక్ష్మీ, కోటగోపి, చివ్వెంల మాజీ ఎంపీపీ కరుణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love