అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలి

– మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను బుధవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు నాలుగు గంటల పాటు కలియతిరిగారు. పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు, వర్క్‌ ఏజెన్సీఇ పలు సూచనలు చేశారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ షీట్ల్‌ బిగింపు తుదిదశ పనులనూ చూశారు. మెయిన్‌ ఎంట్రెన్స్‌, ఫ్లోరింగ్‌ పనులు, ఫౌంటెన్‌ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేప్‌ ఏరియా, మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియంపై అంతస్తులో నిర్మించే రెస్టారెంట్‌ నిర్మాణ పనుల గురించి అధికారులతో మాట్లాడారు. సీఎం చెప్పినట్టుగా నిర్మాణ ప్రాంగణమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ అమరుల త్యాగాలను ప్రతిబింబించే విధంగా నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే దీపం ఆకతి నిర్మాణ పనుల్లో పలు సూచనలు చేశారు. మ్యాన్‌ పవర్‌ పెంచి మూడు షిఫ్టుల్లో పనులు జరగాలనీ, తుది పనుల్లో ఇంకా వేగం పెంచాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి విధించిన నిర్ణీత గడువులోగా ఈ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు, వర్క్‌ ఏజెన్సీకి మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి, ఇతర అధికారులు, వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్‌ తదితరులు ఉన్నారు.

Spread the love