అమెరికా దేశంలో… సియాటిల్‌ నగరంలో…

ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తుతున్నారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం సగర్వంగా తల ఎత్తుకొనే పరిణామం. అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్‌ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్‌ క్షమా సావంత్‌ అనే 49సంవత్సరాల భారతీయ మహిళ. తొలిసారి ఎన్నికైనప్పుడు కనీస వేతనం గంటకు 15డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్‌ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్‌గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్‌ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు. రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ పత్రిక ”అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి?” అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు మేయర్‌ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్‌గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మిత వాదులు, కార్పొరేట్‌ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురవుతున్నారు. కానీ వారిలో అగ్రకులం అనుకొనేవారు అక్కడ కూడా మిగతావారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. అమెరికాలో భారత సంతతికి చెందిన వారు మొత్తం పాతికలక్షల మంది ఉన్నారు. సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్య తీసుకోకపోగా తమ దగ్గర అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళి తుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘ఈక్వాలిటీ లాబ్స్‌’కు… ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్థితి ఉందంటూ అనేక ఫిర్యాదులు అందాయి. ఒత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిన ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. తాజాగా సియాటిల్‌ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్‌ వ్యాలీలో ”అగ్రహార వ్యాలీలు” ఉన్నాయని ‘ఈక్వాలిటీ లాబ్స్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తనిమొళి సౌందరరాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతిరూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలులేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది). అమెరికాలోని స్వామి నారాయణ సంస్థ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పనిచేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.’ఈక్వాలిటీ లాబ్స్‌’ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నారని చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాల యాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిపింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిదిమంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పారు. అయితే భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని వారిలో 53శాతం మాత్రమే చెప్పారట. అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలసవెళ్లారు. తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కుల ముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్థితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు. తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు, 59శాతం మంది కులపరమైన వివక్షకు గురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది. 2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్య కులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళిత యువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ… పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితురాలినని తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ… గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయలేదని చెప్పింది.
అమెరికాలోని దళితుల గురించి ‘ఈక్వాలిటీ ల్యాబ్స్‌’ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి… సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని ప్రాంతాల్లో మూడింట రెండు వంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు. నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు. తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు. తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకి స్తూనే ఆత్మన్యూనతకు లోనుకాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది. మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్‌ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి. భర్త వివేక్‌ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్థశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు. సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలి సారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమె సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమవుతానని ఆమె ప్రకటించారు. మహిళలకు మాత్రమే ఆడవాళ్ల సమస్యలు తెలుస్తాయని, అలాగే దళితులకు మాత్రమే దళితుల సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా వాదించేవారిని దళితురాలు కాని క్షమా సావంత్‌ ఆచరణ ఆలోచింపచేస్తుందా? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ధి కావాలి.
– సత్య

Spread the love