అలరించే బుట్టబొమ్మ ప్రేమకథ

ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మించిన ఫీల్‌ గుడ్‌ రూరల్‌ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు హీరో విశ్వక్‌ సేన్‌ ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, ‘వంశీ నిర్మాణంలో సినిమా చేద్దామని ఎదురుచూస్తున్న హీరోలలో నేను ఒకడిని. నిజానికి ఈ సినిమాలో నేను నటించాల్సి ఉంది. కానీ డేట్స్‌ కుదరకపోవడం వల్ల చేయలేకపోయాను. ఇది నాకు చాలా ఇష్టమైన కథ. గుండెల మీద చేతులేసుకుని వచ్చేయొచ్చు ఈ సినిమాకి.. అంత బాగుంటుంది. అనిఖా, సూర్యలకు మొదటి సినిమాకే సితార బ్యానర్‌లో వంశీ నిర్మాణంలో నటించే అవకాశం రావడం అదష్టమని చెప్పాలి. గోపిసుందర్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ‘మేజర్‌’ తర్వాత వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. నవీన్‌ నూలి ఎడిటర్‌గా చేశారు. వంశీ నిర్మాణంలో నేను చేయబోయే సినిమాని కూడా త్వరలో ప్రకటిస్తాం. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన అర్జున్‌ దాస్‌కి అభిమానిని. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అని చెప్పారు. ‘ఇది ఒక మంచి పల్లెటూరి కథ. ఐదేళ్ల క్రితం ‘ఉయ్యాల జంపాల’ అనే సినిమా చూశాం. అలాంటి సినిమాలో సస్పెన్స్‌లు, ట్విస్ట్‌లు ఉంటే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది ఈ సినిమా. సస్పెన్స్‌తో కూడిన ఒక క్యూట్‌ విలేజ్‌ లవ్‌ స్టోరీ ఇది. విశ్వక్‌ సేన్‌ చెప్పినట్లు త్వరలోనే మా కలయికలో కొత్త సినిమా ప్రకటన వస్తుంది. అందులో విశ్వక్‌ సేన్‌ విశ్వరూపం చూస్తారు’ అని నిర్మాత నాగవంశీ తెలిపారు.
నాయిక అనిఖా సురేంద్రన్‌ మాట్లాడుతూ, ‘హీరోయిన్‌గా ఇది నా మొదటి సినిమా. సితార బ్యానర్‌లో పనిచేయడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నిర్మాత వంశీకి, దర్శకుడు రమేష్‌కి ధన్యవాదాలు’ అని అన్నారు. ‘ నన్ను నమ్మి నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు.. నేను త్రివిక్రమ్‌, వంశీి, చినబాబుకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే దర్శకుడు రమేష్‌ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని హీరో సూర్య వశిష్ఠ చెప్పారు.

Spread the love