అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో అన్యాయం

–  హైకోర్టులో రఘునందన్‌రావు పిటిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ నియోకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌), అసెంబ్లీ అభివృద్ధి నిధి (ఏడీఎఫ్‌) మంజూరు వ్యవహారంలో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలున్న చోట ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనే పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఆ నిధుల విడుదల, కేటాయింపు వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు దాఖలు చేసిన రిట్‌ను సోమవారం జస్టిస్‌ మాధవీదేవి విచారణ చేపట్టారు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగానే నియోజకవర్గానికి నిధులివ్వలేదని సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలున్న చోట్ల నిధుల కేటాయింపులు భారీగా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఏఏజీ రామచంద్రరావు వాదిస్తూ, ఎస్‌డీఎఫ్‌ నిధుల కేటాయింపు అంశం శాసనసభ పరిధిలోనిదనీ, సీఎం, శాసనసభ నిర్ణయాలకు అనుగుణంగా కేటాయింపులుంటాయి కాబట్టి ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ చేయరాదన్నారు. వాదనల తర్వాత ప్రతివాదులైన ప్రధాన కార్యదర్శి, జీఏడీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్లతోపాటు ఇతరులకు హైకోర్టు నోటీసులిచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఎఫ్‌టీఎల్‌లో రోడ్‌ నిర్మాణంపై పిల్‌ దాఖలు
నాయబ్‌ ట్యాంక్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని పేర్కొంటూ నిర్మల్‌కు చెందిన కె అనుజుకుమార్‌ పిల్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరిస్తున్నట్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ సోమవారం ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా చర్యలున్నాయని పిల్‌లో పేర్కొన్నారు.

Spread the love