ఆటో ఎక్స్‌పో అబ్బురం

– విద్యుత్‌ వాహనాలపైనే దృష్టి
– అదరగొడుతున్న కొత్త వాహనాలు
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఆటో ఎక్స్‌పో 2023 గ్రేటర్‌ నోయిడాలో బుధవారం వేడుకగా ప్రారంభమైంది. మూడేండ్ల తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ ప్రదర్శనలో పలు కంపెనీలు తమ కొత్త వాహనాలను ప్రదర్శనకు ఉంచాయి. అబ్బురపరిచే వాహనాలతో చూపరులను కనవిందు చేస్తున్నాయి. ఈ ఎక్స్‌పోలో టాటా మోటార్స్‌, కియా ఇండియా, మారుతీ సుజుకీ, హ్యుందారు, ఎంజి మోటార్‌, జెబిఎం ఆటో తదితర వాహన కంపెనీలు తమ మోడళ్లను ప్రదర్శనకు ఉంచాయి. ఈ దఫా విద్యుత్‌ వాహనాలపై ఎక్కువ దృష్టి నెలకొంది. మెజారిటీ ఆటో మొబైల్‌ కంపెనీలు తమ నూతన ఇవి కాన్సెప్ట్‌ మోడళ్లను ప్రదర్శించాయి. 45 దేశీయ, అంతర్జాతీయ తయారీ కంపెనీల తమ కొత్త మోడళ్లు, విద్యుత్తు కార్లు, కాన్సెప్ట్‌ కార్లు, త్రిచక్ర, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలను ప్రదర్శనకు ఉంచాయి. ఈ ప్రదర్శనలో జనవరి 11, 12 తేదిల్లో మీడియాకు మాత్రమే కేటాయించగా.. 13 నుంచి 18వ తేది వరకు సాధారణ సందర్శకులను అనుమతించనున్నారు.
హ్యుందాయ్‌ నుంచి ఐయోనిక్‌5
హ్యుందాయ్‌ మోటార్స్‌ తన ఐయోనిక్‌ 5 విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. దీంతో పాటు స్లీక్‌ అండ్‌ ఫుల్లీ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఐయోనిక్‌ 6ని కూడా ప్రదర్శించింది. దీన్ని బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ ఆవిష్కరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐయో నిక్‌5 ప్రారంభ ధర రూ.44.95 లక్షలుగా ఆ కంపెనీ నిర్ణయించింది.
మారుతి నుంచి ఇవిఎక్స్‌
మారుతి సుజుకి కొత్తగా ఎస్‌యువి కాన్సెప్ట్‌లో ఇవిఎక్స్‌ విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. దీన్ని ఒక్క సారి చార్జింగ్‌ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఆ సంస్థ తెలిపింది. 2025 నాటికి దీన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఎక్స్‌పోలో ఈ సంస్థ తన 16 వాహనాలను ప్రదర్శనకు పెట్టింది.
ఎంజి హెక్టార్‌ కొత్త హెక్టార్‌..
ఎంజి మోటార్‌ ఇండియా తన తర్వాతి తరం ఎంజి హెక్టార్‌ను విడుదల చేసింది. ఐదు వేరియంట్లలో లభించనున్న ఈ వాహన ఎక్స్‌షోరూం ధరను రూ.14.72 లక్షలుగా నిర్ణయించింది. ఎక్స్‌పోలో తన పాత, రాబోయే 14 వాహనాలను ప్రదర్శనకు ఉంచింది.
టాటా మోటార్స్‌ ఇవి-అవిన్యా..
టాటా మోటార్స్‌ తన ఇవి కాన్సెప్ట్‌ కారు అవిన్యాను తొలిసారి ప్రదర్శించింది. దీన్ని టాటా గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌ చంద్ర శేఖరన్‌, టాటా ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర ఆవిష్కరించారు. ఎక్స్‌పోలో తన టాటా హారియర్‌ ఇవి, సియోర్రా ఇవి, టాటా పంచ్‌, అల్ట్రోజ్‌ను ప్రదర్శించింది.
కియా నుంచి ఇవి9
కియా ఇండియా తన ఇవి9, కెఎ4 విద్యుత్‌ వాహనాలను ఆవిష్కరించింది. వచ్చే నాలుగేళ్లలో విద్యుత్‌ రంగంలో రూ.2వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆర్‌అండ్‌డి, మౌలిక వసతులు, తయారీకి ఉపయోగించనున్నట్లు తెలిపింది.

Spread the love