ఇదొక కవనం, ఇదొక సవనం. ఇదొక సమర శంఖానాదం. ఇదొక ఆత్మ హాహాకారాలతో ముందుకు సాగుతున్న ఆహవ యాత్ర. ఈ యాత్రలో బుద్ధుని పునరాగమనం కోసం నిరీక్షిస్తున్న కపిలవస్తు పుర ప్రజలం మనం. శాంతి ఎల్లవేళలా తెలుపే కానక్కర్లేదని, ‘ప్రజల శాంతి / ప్రపంచ శాంతి / ఎర్రగా కూడా ఉంటుంది.’ అంటారు. అది నీలం కూడా కావచ్చని, అప్పుడే అది వినీలం, విలీనమూ అవుతుందని అంటున్నాడని మనమూ ఆకాంక్షించవచ్చు. బుద్ధోదయంలోని ఎరుపును సంగ్రహించమని సూచన కూడా ఉంది. ఏం చూస్తున్నాడు కవి? ”సమరంలోనే శాంతి /సమరంలోనే కాంతి /సమర సన్నాహమే /ఈ యుగధర్మం” అనే చాటింపును చెవులకు చూపుతున్నాడు. అయితే – దీనికి కొనసాగింపు పార్శ్వం కూడా ఒకటుంది.
Dogmatism and intolerance are the most harmful things in the intellectual world. (P.Laxminarasu)ఏ హాని కారకాలు ఉండకూడదని మనం భావిస్తున్నామో అవే రాజ్యమేలుతున్నాయి. అందరినీ చుట్టుముట్టిన శక్తులు, విపత్తులు, పెను ఆపదలు ఏవో అందరి అనుభవానికొచ్చిన విషయాలే. అయినప్పటికీ తిరిగి తిరిగి ‘రాజు గారి గుడ్డలు’ కథల్లానే పునః పునః మన ప్రయాణాలు, ప్రస్థానాలు సాగుతున్న్కె జోరుగా, హూషారుగా. నోరు తెరుచుకోదు. గొంతు విప్పుకోదు. స్వరం జ్వరగ్రస్తం. అంతటా భయావహ స్థితి. సమస్తమూ భీతి ఆవరించి ఉంది. ఇటువంటి తరుణంలో ‘సమరమే శాంతి’ అంటూ నిట్టనిలువునా పగులుతున్నాడు కవి.
దుర్భేద్యమైన అఖండమైన అసహన అజ్ఞాన ఆవరణలోకి వెలుగు పూలు చల్లుతున్నాడు కసిగా పసిగా.
”శీలం ఆరిపోయింది /జ్ఞానం జారిపోయింది /సమాధి పారిపోయింది /ఆవురుమన్న ‘అర్ధ సత్యం ముందు / ఆర్య సత్యాలు ఆవిరై పోయాయి / ఏడుస్తున్నాను.” అని ప్రకటిస్తున్నాడు. దుఃఖమో, శోకమో అనకుండా ఏడుస్తున్నానంటాడేమిటి. ఈ ఏడుపులోని నిస్సహాయతను గుర్తించిన వారు ధన్యులు. వారు ఓదార్చబడెదరు. తన ఏడుపుకి మూల కారణాలను ఈ దీర్ఘ కవితలో పలు దఫాలుగా విపులంగానే చెప్పుకుంటూ, విప్పుకుంటూ పోయాడు. ఆలకించుకుంటూ పోవడమే మనం చేయాల్సిన పని. సంవేదనలతో కూడిన, పలు నిశ్చయాలు నిండిన స్థిర ప్రకటన ఒకటి, ప్రతిపాదన మరొకటి ఇలా ముందు పెడుతున్నాడు.
”మరణిస్తే యుద్ధంలో మరణించు /జీవిస్తే బౌద్ధంలో జీవించు /బౌద్ధంలో జీవించడానికి / యుద్ధంలో మరణించాలి / యుద్ధంలో మరణించడానికి / బౌద్ధంలో జీవించాలి”.
ఇతని నిశ్చయ వాక్య అంతరంగం ఏమిటో క్షణమాగి, ఆలోచించి అడుగేయండి.
బుద్ధుడు హింసను, యుద్ధాన్ని ప్రేరేపించలేదు. అహింస గురించి చెప్పిన సంగతి తెలియనిదేమీ కాదు. మరెందుకు కవి జీవితం, యుద్ధం, మరణం అంటూ ఒక అనివార్యతను ప్రస్తావిస్తున్నాడు? గత రెండు దశాబ్ధాలలో బౌద్ధం ప్రవర్తిల్లిన ఆయా దేశాలలో హింస ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా మయన్మార్, కాంబోడియా, శ్రీలంక, థారులాండ్ లాంటి చోట్ల హింసోన్మత్తత పెరిగింది. బౌద్ధ బిక్షువులు తలపెట్టిన హింస అది. దానిని సమర్థించుకోవడానికి వారు బౌద్ధ రచనలను ఉదహరించారు. ప్రసాదమూర్తి తాను చూసిన ఈ వైపరీత్య స్థితిని చెప్పడానికి, బౌద్ధ ధర్మం కాని వాటిని అమలు చేసిన పరిస్థితులను తేటతెల్లం చేయడానికి పై విధంగా వ్యాఖ్యానించాడా? యుద్ధం బౌద్ధమే. జీవనం బౌద్ధమే. మరణం బౌద్ధమే.
తనకు యుద్ధం అంటే మరొక అర్ధం కూడా ఉంది. అది విస్తృతం కావడం. విస్తరణం దాని లక్ష్యం. తాను యుద్ధానికిచ్చే నిర్వచనమే వేరుగా ఉంది.
”ఆయుధాలు అవసరం లేని /సైన్యాలు అక్కర్లేని /సరిహద్దు కాపలాలతో పని లేని /కాలంలోకి ప్రయాణించే / అసలు యుద్ధమే బుద్ధుడు” జయించాల్సినవి ఎన్నో ఉన్నవి. సాధించాల్సినవి అనేకం. వాటన్నిటి మీద సాగించాల్సిన యుద్ధం గురించి కూడా ఈ దీర్ఘ కవిత ప్రస్తావనకు తెస్తుంది.
ఒకానొక ఐరానిక స్థితిని, పారడాక్సిక గతిని కలిపి ఉద్వేగ సంభరితంగా వ్యాఖ్యానిస్తున్నది ఈ కవిత. అందుకే ఈ కవితకు ‘విడంబన’ అనేది ముఖ్య అభివ్యక్తి వ్యూహంగా ఉపకరించింది. బుద్ధుడు సకల సౌఖ్యాలను వదిలి సత్యాన్వేషణ కోసం వెళ్లిపోయాడు. రాజ్యాన్ని త్యజించి, పదవి, అధికారం, రాజ్య కాంక్షను వదులుకొని వెళ్లిన బుద్ధుని సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న వ్యవస్థలు అవ్యస్థలుగా, అరాచకపు వ్యవస్థలుగా మారిన వైనాన్ని గూర్చి చెపుతాడు.
”రాజ్య మోహాన్ని వీడినవాడే/ రాజ్యం కావడం విడంబన /సన్యాసులు సైనికులు కావడం విడంబన /హింస నుంచి విముక్తికి /హింసను ఆయుధం చేయడం విడంబన /హిందూ మహా సముద్ర తీరంలో /కాషాయాధికార స్థాపన కోసం / సైనిక ప్రస్థానం ఒక విడంబన /బుద్ధుడు సైనిక శిబిరాల /జెండాగా మారడం ఒక విడంబన /బౌద్ధాన్ని రాజులు ఆశ్రయించిన చోట /రాజ్యాన్ని బౌద్ధం ఆశ్రయించడం విడంబన” అంటూ పలు పరిణామాలను మోసుకు తెస్తున్న సకల వ్యవస్థల పట్ల తనకు గల అభ్యంతరం ఈ దీర్ఘ కవితకు బీజ సూత్రం. అంతవరకే చెప్పి ఉంటే ఇదొక ఖండికగానే మిగిలిపోయేది. అంతకు మించిన ప్రయోజనం కవి ఆశిస్తున్నాడు. అదేమంటే జాతీయ, అంతర్జాతీయ మత రాజకీయాలను ప్రశ్నించటం, బౌద్ధం ఒక మతంగా కాక ఒక ఆచరణగా ఎంత ఉదాత్తమైనదో, ఉత్కృష్టమైనదో తెలియజెప్పి, బౌద్ధం పట్ల సానుకూల దృష్టిని కలిగేట్లు చేయటం. ఈ లక్ష్యంతోనే ఒక ఖండికా మాత్ర కవితగా కాక, దీర్ఘ కవితగా విస్తరించగలిగేట్లు చేయగలిగాడు.
బౌద్ధాన్ని ఆశ్రయించి చెప్పినా ఈ కవిత బుద్ధిస్టు జాతీయవాద ప్రమాదాన్ని గురించి గుర్తించి హెచ్చరిస్తుంది. కవికి గల జాతీయ, అంతర్జాతీయ మత రాజకీయాలపట్ల అవగాహన వల్లనే ఇలా అనగలిగాడు.
”బౌద్ధ రాజ్యం బర్మాలో/ బుద్ధిస్ట్ బిన్ లాడెన్ /ఆశిన్ విరాత్తు ఎలా పుట్టాడు?” అని అడిగినా..
”తీరమంతా / బుద్ధుడి ద్వీపాలు పెట్టుకున్న /సింహళ ద్వీపం / దారి పొడవునా మనిషి నెత్తురే / ఎందుకు తాగిందని ప్రశ్నించినా..
”శ్రీలంకలో దుతుగమనుడు ఏంచేశాడు/ సన్యాసులు సైనికుల్కెన వైనం ఏమిటి? /మైనారిటీల మీద / మెజారిటీల దండయాత్ర దేనికీ?”
మెజారిటీ ఉగ్రత్వంలోని ఉన్మాదం గురించి కవి ఆందోళన ”ఆశిన్ విరాత్తు” ఎట్లా పుట్టాడనే ప్రశ్న తేలికగా తీసివేయగలిగిం దేమీ కాదు. ఈ ప్రశ్నలో 969 ఉద్యమం, మయన్మార్‌లోని ముస్లింల ఊచకోత గురించి తీవ్ర కలత కవితను వెన్నాడుతూ వస్తున్నది. విరాత్తు 969 ఉద్యమానికి మయన్మార్‌లో ఎంతో మద్ధతు ఉంది. ఆ ఉద్యమం మయన్మార్‌ని కాపాడాలని దేశంలో పెరుగుతున్న ముస్లింల సంఖ్య గురించి, దాన్లోని పొంచి వున్న ప్రమాదం గూర్చి అపోహలున్నాయని గుర్తించాడు కవి. ఇటువంటి మత ప్రాతిపదికతో కూడిన హింసను నమ్మిన జాతీయ వాదాలు ఉత్పన్నం చేయగల పరిస్థితుల పట్ల కవికి గల అవగాహనతో వర్తమానానికి అన్వయించి ఇలా అంటారు.
”కాషాయంలో బుద్ధుడు కనపడడు/ శిరోముండనమే బౌద్ధ శిరోధార్యం కాదు/గుండెలతో కడితేనే ఆ రామం/ కత్తులతో శాంతి స్తూపం చెక్కలేరు”
కాబట్టి హింసోన్మాదాన్ని వదిలి పెట్టాల్సిందేనని ఉద్భోధ. వ్యక్తులను హింసోన్మత్తత అవహించి సృష్టించే విధ్వంసం ఎంత ఉంటుందో ఊహించటం కష్టమేమీ కాదు. దీనిని నివారించాలంటే శాంతి కోసం యుద్ధం చేయాలి. ఇది మతాధిపత్య యుద్ధం కాకూడదు. మనిషి తనలో తాను సాగించాల్సిన యుద్ధం వైపుకు నడవాలని ఆకాంక్ష.
కొన్ని కోరికలను తాను నిర్వచించాడు. వాటిలో ‘ఆధిపత్యం కోరిక’ ‘పాలించడం కోరిక’ అంటాడు. తనను తాను గెలుచుకున్న ప్రతి వ్యక్తీ గౌతముడే కవి దృష్టిలో. తన మీద తాను సాగించే యుద్ధంలో ‘సమస్త జీవరాశితో నీ మమతాను బంధం’ ఎంతో అంచనాలకు రమ్మంటాడు కవి.
అలాగే
”రాగద్వేష మోహరహిత ధ్యానం నీ యుద్ధం /సమతా దృష్టి సత్సంకల్ప దయా వృష్టి /సహృదయ వాక్కు…. సద్ధర్మ కర్మ /సాధు సాధన… సంఘ జీవన /సమస్తమూ యుద్ధమే /యుద్ధమే శాంతి” అని ప్రతిపాదన. ఇదొక సమ్యగ్యత్నం.
అంతకు ముందే పుట్టిన చెడును వొదిలిపెట్టే ప్రయత్నం, ఇంకా పుట్టని చెడును పుట్టకుండా ఆపటం. ఇంకా ఉద్భవించని మంచిని ఉద్భవించేట్లు పురికొల్పటం, ఇంతకు ముందే పుట్టి ఉన్న మంచిని మరింత పెంచే ప్రయత్నం. ప్రసాదమూర్తి తన కవితా సంవేదనను, ఉద్వేగాలను మరొక తాత్త్విక తలంలోకి తీసుకుపోయిన సఫలయత్నం. ఇందులో ప్రసాదమూర్తి చెప్పినవి బుద్ధుని గుప్పిటలోని ఆకులతో సమానం. కవి బోధించాలనుకున్నది అడవిలోని మొత్తం ఆకులకు సమానం.
(ప్రసాదమూర్తి దీర్ఘకావ్యం ‘యుద్ధమే శాంతి’ ముందు మాటలో కొంత భాగం)
– సీతారాం