ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి మళ్లీ టెండర్‌

– ఇంటర్‌ బోర్డు నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియెట్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి సంబంధించి మళ్లీ టెండర్‌ను ఆహ్వానించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి జయప్రదబాయి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి సంబంధించిన టెండర్‌కు దరఖాస్తు చేసే ప్రక్రియ సోమవారంతో ముగిసిందని తెలిపారు. మూడు గంటలకు టెండర్‌ బిడ్‌లను ఓపెన్‌ చేశామని పేర్కొన్నారు. మాగటిక్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మాత్రమే టెండర్‌లో పాల్గొన్నదని వివరించారు. సస్పెండైన జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి మధుసూదన్‌రెడ్డి ఆరోపణల ప్రకారం గ్లోబరీనా కొత్త అవతారం ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టెండర్‌లో పాల్గొనలేదని తెలిపారు. దీంతో ఆయన చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని రుజువైందని పేర్కొన్నారు. ఒకే సంస్థ బిడ్‌ దాఖలు చేయడంతో కొత్తగా మళ్లీ ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇంటర్‌ వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీతోపాటు జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌ కోసం ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరం వార్షిక పరీక్షల్లో తొలుత లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు 20 లక్షలు, ఆర్ట్స్‌, కామర్స్‌ (హ్యుమానిటీస్‌) సబ్జెక్టులకు పది లక్షలు, ఒకేషనల్‌ సబ్జెక్టులకు ఐదు లక్షలు కలిపి మొత్తం 35 లక్షల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేస్తారు. సైన్స్‌ సబ్జెక్టులకు ఆఫ్‌లైన్‌ (పాత పద్ధతిలో) మూల్యాంకనం జరుగుతుంది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో లాంగ్వేజ్‌ సబ్జెక్టులు ఏడు లక్షలు, ఆర్ట్స్‌, కామర్స్‌ (హ్యుమానిటీస్‌) సబ్జెక్టులు 3.50 లక్షలు, ఒకేషనల్‌ 1.50 లక్షలు కలిపి మొత్తం 12 లక్షల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేపడతారు.
మధుసూదన్‌రెడ్డి హర్షం
ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని నిర్ణయించడం పట్ల ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మెన్‌ పి మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Spread the love