‘నేను దర్శక దేవుడిగా భావించే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని చూశారు. ఆయనకు ఈ సినిమా ఎంతో నచ్చింది. తన భార్యను కూడా ఈ చిత్రాన్ని చూడాలని ఆయన కోరారు. అంతేకాదు ఆమెతో కలిసి మరోమారు సినిమా చూశారు’ అని దర్శకుడు రాజమౌళి సోషల్‌మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి కలిసి దిగిన ఫొటోలు, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా గురించి అలాగే రాజమౌళిని ప్రశంసించిన జేమ్స్ కామెరూన్ ఆడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
ఆస్కార్ అవార్డుకి ఒక్క అడుగు దూరంలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తాజాగా మరో అరుదైన పురస్కారాన్ని దక్కించుకుంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ పాట విభాగాల్లో ప్రతిష్టాత్మక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకుంది. 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుకలో ఈ అవార్డులను రాజమౌళి, కీరవాణి అందుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది, భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇటీవలే ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకుంది.