ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

– రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌ టాయిలెట్లు, షామియానాలు :టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. రద్దీ ప్రాంతాలైన ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, కేపీహెచ్‌బీలో టీఎస్‌ఆర్టీసీ తాత్కాలికంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరుతో పాటు మొబైల్‌ బయో టాయిలెట్లను ఏర్పాటు చేశామని వివరించారు. రద్దీ ప్రాంతాల్లోని పరిస్థితిని బస్‌ భవన్‌, ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారని చెప్పారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం సాధారణ చార్జీలతో పాటు తిరుగు ప్రయాణంపై పది శాతం రాయితీ కూడా ఇస్తున్నామన్నారు. పండుగ సీజన్‌ దృష్ట్యా ీ 4,233 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. త్వరగా గమ్యస్థానాలకు చేరేందుకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకోసం టోల్‌ప్లాజాల దగ్గర ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 14 వరకు నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ వెళ్లే బస్సులు జేబీఎస్‌ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీనగర్‌ నుంచి, మహబుబ్‌నగర్‌, కర్నూలు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్‌ నుంచి, వరంగల్‌,హన్మకొండ, తొర్రూర్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు కేపీహెచ్‌బీ/బీహెచ్‌ఈఎల్‌ నుంచి బయలుదేరుతాయని వివరించారు.

Spread the love