ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి మోసాల బారిన పడొద్దు : గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలు మోసాల బారిన పడకుండా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సూచించారు. ఆదివారం హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ సిబ్బందికి నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహనా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఎక్కడ పొదుపు చేసుకోవాలో తెలియకపోవడంతో తరచూ మోసపోతుంటామని హెచ్చరించారు. అవగాహన లేని వారిని మోసగాళ్లు గుర్తించి ఒక గ్రాము బంగారానికి 10 గ్రాముల బంగారం ఇస్తామంటూ రకరకాలుగా ప్రలోభపెడుతుంటారని తెలిపారు. ఇలాంటి వారికి దూరంగా భవిష్యత్‌ అవసరాల కోసం డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలని కోరారు. కరోనా, లాక్‌డౌన్‌ సందర్భాల్లో గ్రామీణ భారతదేశంలోని లక్షలాది కుటుంబాలను ఈ పొదుపు చేసుకునే అలవాటే బతికించిందని అభిప్రాయపడ్డారు. గతంలో పొదుపు చేసుకునేందుకు ఇబ్బందులుండేవని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆర్థికంగా ఐదో స్థానం నుంచి మూడో స్థానానికీ, అదే సమయంలో ఐదు ట్రిలియన్ల బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతున్నదని తెలిపారు. జీవితం ఒక సవాలంటూ, ఇబ్బందులెదురైనప్పుడు ముందుకెళ్లిన వారినే విజయం వరిస్తుందని చెప్పారు. పిల్లల జన్మదిన వేడుకలు, వివాహ మహౌత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆశిస్తుంటారనీ, పిల్లల కోరికలు తీర్చేందుకు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా బీమా కంపెనీలు కూడా వచ్చాయని తెలిపారు. గవర్నర్‌ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్‌ మాట్లాడుతూ పదవీ విరమణ తర్వాత సౌకర్యంగా జీవిచేందుకు వీలుగా పొదుపునకు సంబంధించిన అవగాహన పెంచేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ ఆదాయం పెంచుకోవడం, విద్య, వైద్యం వంటి ప్రాధాన్యత కలిగిన వాటికే ఖర్చు చేస్తూ అనవసరమైన వాటికి ఖర్చులను తగ్గించుకోవడం తదితర అంశాలను శిక్షణలో తెలుసుకోగలుగుతారన్నారు. అదే సమయంలో పొదుపు చేయించుకునే వాటికి ఉన్న చట్టబద్ధత, పొదుపు చేసిన దానికి అధిక మొత్తంలో తిరిగి ఇచ్చే సంస్థలేవి? అనే వాటిపై అవసరమైన వారికి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్‌ కూడా ఇస్తారని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ రీజినల్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ చటర్జీ, సౌత్‌ జోన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సంపద సృష్టిలో కుటుంబాలను భాగస్వాములను చేసే లక్ష్యంతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పొదుపు, పెట్టుబడి, సంపద మధ్య తేడా తెలుసుకోవాలని సూచించారు. మూడు లక్షల మందికి అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రెటరీ భవానీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love