ఆర్థిక సంక్షోభం తీవ్రం…

– లాభార్జన కోసం కార్పొరేట్ల కొత్త మార్గాలు
– భిన్నత్వంలో ఏకత్వాన్ని బీజేపీ అంగీకరించట్లేదు
– సమరశీల పోరాటాలను కార్మిక సంఘాలు చేయాలి : సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌
సిద్ధిపేట నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తీవ్రమైందనీ, అమెరికా, యూరప్‌, తదితర దేశాల్లో కార్మిక, ప్రజా ఉద్యమాలు ఊపందుకున్నాయని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. ఈ సమయంలో కార్పొరేట్లు తమ లాభాలను ఏమాత్రం తగ్గించుకోకుండా మరింత పెంచుకోవడంలో భాగంగా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన సభలో తపన్‌సేన్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిందనీ, మరోవైపు నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. లాభాల అన్వేషణలో అందివచ్చిన ప్రతి అంశాన్నీ వినియోగించుకుంటున్నాయని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నియామక పద్ధతుల్లోనూ మార్పులు తీసుకొచ్చి కార్మికుల పొట్టగొడుతున్నాయన్నారు. పనిగంటలు పెంచి పనిచేయించుకుంటున్న తీరునీ, ఊబర్‌, ఓలా, స్విగ్గీ, తదితర సంస్థలు గిగ్‌ కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్న తీరును వివరించారు. దేశంలో కొత్తగా 2 కోట్ల మంది గిగ్‌ కార్మికులు తయారుకాబోతున్నారని చెప్పారు. ఓవైపు ఉన్నవారు ఉపాధి కోల్పోయి..మరోవైపు అవకాశాలు లేక కొత్తతరం వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అదే సమయయంలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిందనీ, నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండటంతో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని వివరించారు. వారు పోరాటాల్లోకి రాకుండా, ప్రభుత్వంమీద అసంతృప్తి పెంచుకోకుండా, ప్రజల మధ్య ఐక్యత రాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన రాజకీయాలకు పూనుకున్నదని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని బీజేపీ అస్సలు సహించడం లేదని చెప్పారు. పని పద్ధతుల్లోనూ అనేక మార్పులు తీసుకొచ్చి మూడోవంతు కాంట్రాక్టు కార్మికులతో, మూడోవంతు ఔట్‌సోర్సింగ్‌ కార్మికులతో, మూడో వంతు రెగ్యులర్‌ ఉద్యోగులతో, కొంత ట్రైనీలతో పనిచేయించుకుంటూ వారి మధ్య ఐక్యత రాకుండా కార్పొరేటు సంస్థలు వ్యవహరిస్తున్నాయ న్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు గతంలో ఆయా సంస్థలు కొంతమేరకు సౌకర్యాలు కల్పించేవనీ, ఇప్పుడేం వర్తింపజేయట్లేదని చెప్పారు. కొద్దికాలంలో గంటల కొద్దీ పనిచేయించుకునే విధానం కూడా రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇలా కార్మికవర్గంపై కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు ముప్పేట దాడి చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రుణాలు, రాయితీలు ఇస్తూ పోతున్నదన్నారు. అన్ని రకాల సౌకర్యాలున్నా ప్రభుత్వ రంగ సంస్థలను, రోడ్లను, పోర్టులను, విమానాశ్రయాలు, రైల్వేలను, ఇలా అన్నింటినీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నదనీ, ఉన్న ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని విమర్శించారు. మతాన్ని రాజకీయంగా వాడుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తున్నదన్నారు. దేశానికి కీలకమైన డిఫెన్స్‌ రంగం మీదా దాడి జరుగుతున్నదని చెప్పారు.
నిజమైన శత్రువు ఎవరో అంచనా వేసి పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం కార్మిక సంఘాల మీద ఉందని నొక్కి చెప్పారు. కర్బన ఉద్గారాలను ఎక్కువ మోతాదులో వెదజల్లుతున్న పెట్టుబడి దారీ దేశాలు…దాన్ని తగ్గించే విషయంలో మాత్రం పేద దేశాలపై ఆంక్షలు విధిస్తున్న తీరును వివరించారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నదీ పెట్టుబడి దారీ దేశాలేనన్నారు. మన దేశంలో బొగ్గు ఉత్పత్తిపైనా ఆంక్షలు విధించాయనీ, దీంతో భెల్‌, తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తులపై ప్రభావం పడుతున్నదని చెప్పారు. ఈ సభలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు పాల్గొన్నారు.

Spread the love