ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్ నూత‌న క‌మిటీ ఎన్ని‌క‌

– ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.రమేశ్‌, శ్రీకాంత్‌మిశ్రా కోశాధికారిగా బిఎస్‌.రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.రమేశ్‌, శ్రీకాంత్‌ మిశ్రా, కోశాధికారిగా బీఎస్‌ రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో పాటు 18 మంది ఆఫీస్‌బేరర్లుగా (9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది సహాయ కార్యదర్శులు) ఉండనున్నారు. కలకత్తా నగరంలో ఆ అసోసియేషన్‌ 26వ అఖిల భారత మహాసభలు బుధవారం ముగిశాయి. అందులో నూతన కమిటీ ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రమేశ్‌, శ్రీకాంత్‌ మిశ్రా మీడియాతో మాట్లాడారు. తమ అసోసియేషన్‌ మహాసభల్లో ఉద్యోగుల, వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితం కాకుండా దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను కూడా చర్చించామని తెలిపారు. మహాసభలో 1,500 మంది ప్రతినిధులు, పరిశీలకులు పాల్గొన్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా నిలిచిన ప్రభుత్వ రంగాల రక్షణ కోసం నిరంతర క్యాంపెయిన్‌ చేసేలా ఉద్యోగులను చైతన్యపర్చాలని తీర్మానించామని చెప్పారు. ఇన్సూరెన్స్‌ రంగంలో అపరిష్కృతంగా ఉన్న ఫ్యామిలీ పెన్షన్‌ పెంచి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలనీ, నిరుద్యోగ యువతకు ఉపాధి తక్షణమే కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రెండు గంటల సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా రాబోయే రెండేండ్లల్లో ఉద్యోగులను, ప్రజలను చైతన్య పరుస్తూ సదస్సులు, సమావేశాలు, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ రంగాల్లో వాటాల ఉపసంహరణకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు.

Spread the love