ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!

పడిపోకుండా పట్టుకోండిరా..!
మాయింటి నిట్టాడురా అది!
దాని చుట్టూనే నిర్మించుకున్న నా సామ్రాజ్యం
మా వాడు, చేతగాని చంద్రబాబు నమ్ముకున్న
‘సత్తి’ రాజు కాదు
నాడు సెబీని నియంత్రించడం
మన్‌మోహన్‌కి చేతకాలే!
అందుకేగా ఆ లింగరాజు ఊచల్లెక్కబెట్టాడు
అసలు కుబేరులను ఎక్కడైనా జైల్లో పెడ్తారా?
అప్పుడు గవర్నమెంట్లు బతికేదెట్టా?
భక్తులిచ్చే ఖరీదైన సూట్లు కట్టేదెట్టా?
అస్మదీయ ‘నిట్టాడు’ను సెబి బహిష్కరిస్తే..!
నా ఇజ్జత్‌ ఏంగాను?
మరీ 14వందల ఏండ్లా?
వాడి పుత్ర, పౌత్ర, ప్రపౌత్రాదులంతా షేర్ల
జూదంలోకి రాలేక పోతే..?!
స్వరాష్ట్రం సురాష్ట్రం అయ్యేదెట్టా?
అది జరుగకపోతే నా పునాది కూలిపోదా?
కరోనాలో జనం బతుకులు కాలి బూడిదైతే
మా’నిట్టాడే’గా భారత గోవర్ధనగిరిని
చిటికెన వేలిపై నిలబెట్టింది!
ఇప్పుడు వాడి చుట్టు కొలత 891 రెట్లు పెరిగిందని
వాడెవడో చెప్తే ఈ లొల్లేంది?
బయట డొల్ల కంపెనీలు పెట్టి, దేశంలోకి
డబ్బు దొర్లించడం
ఇప్పుడేదో కొత్తగా చేసినట్టు ఈ గోలేంది?
ఆ కంనెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టడం దానిష్టం!
దాని వెనక నేనుండటమేంటి?
నాన్సెన్స్‌!!
అంత భారీ విగ్రహాన్ని పడిపోకుండా ఆపడానికేగా
ఎస్‌బిఐ ఆసరా కర్రలు పెట్టింది!
అయినా, అప్పిచ్చువాడు వైద్యుడనే కదా
సుమతీ శతకకారుడు చెప్పింది!
అది కూడా తెలీని దద్దమ్మల్లా ఉన్నారే జనం!
మావాడుషారోడు కాబట్టే
నా బాణాల్నే వాడుతున్నాడు
పాకిస్థాన్‌ కుట్రుందన్నాడు!
చైనా కుతంత్రమన్నాడు!
భారతదేశంపైనే దాడన్నాడు!
అవి పాశుపతాస్త్రాలు! సుదర్శన చక్రాలు!
నన్ను తిట్టినా, మా’నిట్టాడి’ని తిట్టినా
దేశాన్ని తిట్టినట్టే!
భారతీయ సంస్కృతిని తిట్టినట్టే!
ఖబడ్దార్‌!!

– ఆరెస్బీ

Spread the love