– తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి డిమాండ్
హైదరాబాద్ :ఇంటర్ బోర్డ్‌పైనా, అధికారులపైనా కొందరు వ్యక్తులు స్వార్థంతో చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ విద్యావ్యవస్థను నాశనం చేసేందుకు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 2019లో అనుభవం ఉన్న వ్యక్తులు పరీక్షలు నిర్వహించినా అవకతవకలు జరగడంతో 27 మంది, 2021లో అవసరం లేని సమయంలో పరీక్షలు నిర్వహించడంతో ఆరుగురు విద్యార్థులు మరణించారని గుర్తు చేశారు. ఆ చావులకు కారణమైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. చదువు చెప్పని, పరీక్షలకు సంబంధం లేని వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలకు తప్పుడు సమాచారం పంపుతూ అనుభవం లేని వ్యక్తులు ఇంటర్ బోర్డు లో తిష్ట వేశారంటూ బదనాం చేస్తు న్నారని తెలిపారు. అలాంటి వారు ఎవరున్నారో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.