– జర్నలిస్టుల హెల్త్‌కార్డులపై స్పష్టతనివ్వాలి
– హెచ్‌యూజే కార్యవర్గం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) కార్యవర్గం డిమాండ్ చేసింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తగిన విధానంతో ప్రభుత్వం ముందుకు రావాలని కోరింది. హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో హెచ్‌యూజే జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి అరుణ్ కుమార్, బి జగదీశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంభిస్తోందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు పోరాడుతున్నారన్నారు. ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లామనీ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులకు పలుసార్లు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇప్పుడైనా తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కోర్టు అడ్డంకులు తొలగిపోవడం తో… ఈసారి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం వెంటనే తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక విధివిధానాలు రూపొందిస్తామంటూ ప్రకటించారని గుర్తు చేశారు. దీంట్లో జర్నలిస్టుల అంశాలను చేర్చలేదన్నారు. దీంతో జర్నలిస్టు హెల్త్ కార్డులు భవిష్యత్తులో పనిచేస్తాయా? లేదా?అన్నది స్పష్టత లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో హెచ్‌యూజే నాయకులు నవీన్, రాజశేఖర్, నాగమణి, దామోదర్, ఎం రమేష్, సర్వేశ్వర్‌రావు, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, పద్మరాజు, నిరంజన్, విజయానంద్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.