ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!

– భారత్‌లో టెస్టు సిరీస్‌పై స్మిత్‌, వార్నర్‌
నవతెలంగాణ-బెంగళూర్‌
భారత్‌, ఆస్ట్రేలియా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ పోరు ప్రపంచ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక సిరీస్‌ల్లో ఒకటి. గత దశాబ్దానికి పైగా ఈ రెండు జట్లు టెస్టుల్లో తలపడిన ప్రతిసారి నరాలు తెగే ఉత్కంఠతో పాటు ఇరు జట్ల డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం వేడెక్కేలా చేస్తుంది. గత రెండు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలను టీమ్‌ ఇండియా గెల్చుకోగా.. 2016-17 తర్వాత తొలిసారి భారత్‌లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆడనున్న ఆస్ట్రేలియా.. ఇక్కడ సిరీస్‌ విజయం సాధిస్తే అది యాషెస్‌ కంటే గొప్పగా ఉంటుందని అభివర్ణించారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో తొలి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ఆరంభం కానుంది. ‘ సిరీస్‌ విజయం పక్కనపెడితే.. భారత్‌లో ఓ టెస్టు మ్యాచ్‌ నెగ్గటం సైతం అత్యంత క్లిష్టమైన పని. మేము (ఆస్ట్రేలియా) ఆ పని చేయగలిగితే ఆ ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. భారత్‌లో టెస్టు సిరీస్‌ విజయం.. యాషెస్‌ సిరీస్‌ కంటే పెద్దదని నా అభిప్రాయం’ అని కీలక బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. ‘ యాషెస్‌ సిరీస్‌ విజయంలో భాగం కావటం అమోఘమైన భావన. కానీ టెస్టు క్రికెట్‌లో భారత్‌లో భారత్‌ను ఓడించటమనే సవాల్‌ మాకు అత్యంత కఠినం. భారత పర్యటన పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు నాకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని డ్యాషింగ్‌ ఓపెన్‌ డెవిడ్‌ వార్నర్‌ అన్నాడు. గాయాలతో తొలి టెస్టుకు దూరమైన జోశ్‌ హాజెల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌ సైతం భారత్‌లో టెస్టు విజయంపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘భారత్‌లో భారత్‌పై టెస్టు విజయం సాధించి చాలా కాలమైంది. ప్రపంచ క్రికెట్‌లో అందరి లక్ష్యం ఒక్కటే.. భారత్‌లో టెస్టు సిరీస్‌ విజయం అందుకోవటం. భారత్‌లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సాధిస్తే అది ఆస్ట్రేలియా క్రికెట్‌ కీర్తి కిరీటంలో విలువైన వజ్రంగా నిలిచిపోనుంది. ఇక్కడ పర్యటించటం అత్యంత కఠినం. ఈ పరిస్థితుల్లో భారత్‌ అత్యంత బలమైన జట్టు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో ఆస్ట్రేలియా పర్యాటక జట్లకు అందని ద్రాక్ష భారత్‌లో టెస్టు సిరీస్‌ విజయమని’ హాజెల్‌వుడ్‌, స్టార్క్‌లు అన్నారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సైతం సహచరుల అభిప్రాయాలు ప్రతిధ్వనించేలా మాట్లాడారు. ‘ భారత్‌లో టెస్టు సిరీస్‌ విజయం సాధించటం యాషెస్‌ సిరీస్‌, అంతకంటే ఎక్కువ విలువైనది. ఇక్కడ నెగ్గితే అది కెరీర్‌ హైలైట్‌గా నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకాన్ని ప్రతిబింబించే విజయంగా ఉంటుంది’ అని పాట్‌ కమిన్స్‌ అన్నాడు. భారత్‌తో బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగళూర్‌లో నాలుగు రోజుల పాటు సాధన చేస్తున్నారు. నేడు బెంగళూర్‌ నుంచి నాగ్‌పూర్‌కు ఆసీస్‌ క్రికెటర్లు బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు సీఏ వెబ్‌సైట్‌కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Spread the love