– ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 263/10
– రాణించిన షమి, అశ్విన్, జడేజా
– భారత్ తొలి ఇన్నింగ్స్ 21/0
– భారత్, ఆసీస్ రెండో టెస్టు తొలి రోజు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఫిరోజ్ షా కోట్లలో బౌలర్లు కదం తొక్కారు. తొలి రోజు పిచ్ నుంచి లభించిన అనుకూలతను సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేసింది. పేసర్ మహ్మద్ షమి (4/60) నిప్పులు చెరగగా.. అశ్విన్ (3/57), జడేజా (2/68) మాయజాలం కొనసాగింది. కంగారూలను బౌలర్లు తొలి రోజే కుప్పకూల్చటంతో.. ఇక టెస్టుపై పట్టు బిగించే బాధ్యత బ్యాటర్లు తీసుకోవాల్సి ఉంది. నేడు భారత బ్యాటింగ్ రెండో టెస్టు గమనాన్ని నిర్దేశించనుంది.
మహ్మద్ షమి (4/60), రవిచంద్రన్ అశ్విన్ (3/57), రవీంద్ర జడేజా (3/68) త్రయం రెచ్చిపోయింది. షమి పదునైన పేస్‌తో హడలెత్తించగా.. అశ్విన్, జడేజా మాయకు కంగారూలకు దిమ్మతిరిగింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (81, 125 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72 నాటౌట్, 142 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీలతో ఆస్ట్రేలియాకు మంచి స్కోరు అందించారు. పిచ్ నుంచి బ్యాటర్లకు సహకారం దక్కినా.. భారత బౌలర్లు 78.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 21/0తో కొనసాగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (13 బ్యాటింగ్), కెఎల్ రాహుల్ (4 బ్యాటింగ్) అజేయంగా క్రీజులో ఉన్నారు. భారత్ మరో 242 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.
సెషన్ 1 : మెరిసిన షమి, అశ్విన్
పొగమంచు అప్పుడప్పుడే తొలుగుతుండగా బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి గంట ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఓపెనర్లు డెవిడ్ వార్నర్ (15), ఉస్మాన్ ఖవాజ (81) వికెట్ నిలుపుకున్నారు. ఆరంభంలో వికెట్లు ఆశించిన భారత్‌కు కాస్త నిరాశ తప్పలేదు. ఓ ఎండ్‌లో వార్నర్ నెమ్మదించినా.. ఉస్మాన్ ఖవాజ పరుగుల వేటలో దూకుడు ప్రదర్శించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఇక్కడే పేసర్ మహ్మద్ షమి బ్రేక్ సాధించాడు. డెవిడ్ వార్నర్‌ను వెనక్కి పంపించాడు. మార్నస్ లబుషేన్ (18)తో కలిసి ఖవాజ పోరాటం కొనసాగించాడు. కానీ ట్రంప్‌కార్డ్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో అదరగొట్టాడు. తొలుత లబుషేన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన అశ్విన్.. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ తొలి సెషన్లో భారత్‌కు పైచేయి సాధించాడు. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 94/3తో నిలిచింది.
సెషన్ 2 : నిలిచిన ఖవాజ, హ్యాండ్స్‌కాంబ్
లంచ్ బ్రేక్ అనంతరం ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ట్రావిశ్ హెడ్ (12)ను షమి సాగనంపాడు. 108/4తో ఆస్ట్రేలియా మరోసారి కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో ఓపెనర్ ఖవాజకు తోడుగా నిలిచిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72 నాటౌట్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు విలువైన పరుగులు జోడించింది. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో దూకుడుగా పరుగులు సాధించిన ఖవాజ ఇన్నింగ్స్‌ను జడేజా ముగించాడు. దీంతో 59 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (0) నిరాశపరిచాడు. వరుస ఓవర్లలో ఖవాజ, అలెక్స్ కేరీ నిష్క్రమించటం ఆసీస్‌ను మరింత దెబ్బకొట్టింది. కెప్టెన్ పాట్ కమిన్స్ (33) అండతో టీ విరామ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించాడు పీటర్ హ్యాండ్స్‌కాంబ్. ఈ సెషన్లో 105 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
సెషన్ 3 : ఆసీస్‌ను కుప్పకూల్చారు
తొలి రెండు సెషన్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. చివరి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయి 64 పరుగులే చేసింది. జడేజా ఓవర్లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ క్యాచౌట్‌గా నిష్క్రమించాల్సిన వచ్చినా.. నో బాల్ కావటంతో విలువైన జీవనదానం లభించింది. అక్కడ్నుంచి రెచ్చిపోయిన హ్యాండ్స్‌కాంబ్ ఆసీస్‌కు మంచి స్కోరు కట్టబెట్టాడు. ఆరు ఫోర్లతో 110 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన హ్యాండ్స్‌కాంబ్ ఓ ఎండ్‌లో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ 33 పరుగులతో రాణించాడు. టెయిలెండర్లను జడేజా, షమిలు వరుసగా అవుట్ చేయటంతో ఆసీస్ కథ 263 పరుగుల వద్ద ముగిసింది. కమిన్స్, టాడ్ మర్ఫీ (0)లను జడేజా.. నాథన్ లయాన్ (0), మాథ్యూ (6)లను షమి అవుట్ చేశారు.
ఇక మూడో సెషన్లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు జోడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 నాటౌట్, 34 బంతుల్లో 1 ఫోర్), కెఎల్ రాహుల్ (4 నాటౌట్, 20 బంతుల్లో) అజేయంగా ఆడుతున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక్కడే ఆసీస్ శిబిరంలో పేస్ బౌలర్. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నేడు భారత బ్యాటర్లను ఏ విధంగా నిలువరిస్తుందనేది ఆసక్తికరం. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు ఆరంభానికి ముందు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ చతేశ్వర్ పుజారను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. కెరీర్ వందో టెస్టు ఆడుతున్న పుజారకు సునీల్ గవాస్కర్ బోర్డు తరఫున జ్ఞాపిక అందజేశాడు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి) భరత్ (బి) షమి 15, ఉస్మాన్ ఖవాజ (సి) రాహుల్ (బి) జడేజా 81, లబుషేన్ (ఎల్బీ) అశ్విన్ 18, స్టీవ్ స్మిత్ (సి) భరత్ (బి) అశ్విన్ 0, ట్రావిశ్ హెడ్ (సి) రాహుల్ (బి) షమి 12, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ నాటౌట్ 72, అలెక్స్ కేరీ (సి) కోహ్లి (బి) అశ్విన్ 0, పాట్ కమిన్స్ (ఎల్బీ) జడేజా 33, టాడ్ మర్ఫీ (బి) జడేజా 0, నాథన్ లయాన్ (బి) షమి 10, మాథ్యూ కుహ్నేమాన్ (బి) షమి 6, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (78.4 ఓవర్లలో ఆలౌట్) 263.
వికెట్ల పతనం : 1-50, 2-91, 3-91, 4-08, 5-167, 6-168, 7-227, 8-227, 9-246, 10-263.
బౌలింగ్ : మహ్మద్ షమి 14.4-4-60-4, మహ్మద్ సిరాజ్ 10-2-30-0, రవిచంద్రన్ అశ్విన్ 21-4- 57-3, రవీంద్ర జడేజా 21-2-68-3, అక్షర్ పటేల్ 12-2-34-0.
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ బ్యాటింగ్ 13, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ 4, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (9 ఓవర్లలో) 21.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 3-1-7-0, మాథ్యూ కుహ్నేమాన్ 4-1-6-0, నాథన్ లయాన్ 2-0-4-0.