”మెరుపు మెరిస్తే వానకురిస్తే ఆకాశాన హరివిల్లు విరిస్తే… అది మాకేనని ఆనందించే పిల్లల్లారా పిడుగుల్లారా” అంటాడు శ్రీశ్రీ. కానీ నేటి ఆధునిక సమాజంలో పిల్లలకు ఆ స్వేచ్ఛ ఉందా? సంతోషం వచ్చినా.. బాధేసినా అమ్మ కొంగు చాటుకో… నాన్న భుజాల మీదికో చేరుకోవటమే వారికి తెలిసిన విద్య. అలాంటి చిట్టిపొట్టి చిన్నారుల జీవితాలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లో… అధికారుల అలసత్వం వల్లో… తల్లిదండ్రుల బాధ్యతా రాహిత్యం వల్లో గాల్లో కలిసిపోతే అది క్షమించరాని నేరం. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘోరం. మొన్నటి ఆదివారం రోజున ఇలాంటి ఘోరాతి ఘోరమే విశ్వనగరంగా మనం జబ్బలు చరుచుకుంటున్న హైదరాబాద్‌లో జరిగింది. అభం శుభం తెలియని నాలుగేండ్ల ప్రదీప్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో కన్నుమూయటం హృదయమున్న వారందర్నీ కలిచివేసింది. దాడి క్రమంలో ఆ పసివాణ్ని ఓ పాత దుప్పటిని చింపినట్టో లేదా ఓ కాగితాన్ని లాగినట్టో… కుక్కలు కాలు, చేయి పట్టి లాగేసిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో చూసినప్పుడు గుండె నీరైంది. పాపం ఆ సమయంలో ఆ చిన్నారి ఎంత నరకయాతనను అనుభవించాడో కదా..? ఈ ఘటన నేపథ్యంలో అనేకాంశాలను మనం లోతుగా పరిశీలించాలి… చర్చించాలి… వాటికి పరిష్కార మార్గాలను శాస్త్రీయ పద్ధతిలో కనుక్కోవాలి. ‘వీధి కుక్కల స్వైర విహారం… భౌ… భౌల మోత… శునకాలతో జనాలకు తిప్పలు…’ ఇలాంటి శీర్షికలతో పత్రికల్లో కథనాలు రావటం, వాటిపై అధికారులు షరా మామూలుగా వివరణలివ్వటం, ఆ తర్వాత కుక్కలు తమ పని తాము చేసుకుని పోవటమనేది రాష్ట్రంలోని నగర పాలక సంస్థల నుంచి పంచాయతీల దాకా ఏండ్లుగా కొనసాగుతున్న తతంగమే. హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎమ్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్-దీన్నే కుక్కల దవాఖానా అంటారు) దగ్గర ఒక గంట సేపు నిలబడితే చాలు… సీజన్లతో సంబంధం లేకుండా ప్రతీ రోజూ ఎంత మంది శునక బాధితులుగా మారుతున్నారనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. కేవలం మనుషులే కాదు… మూగ జీవాలు సైతం కుక్కల దాడిలో బలవుతున్నాయి. ఆ క్రమంలో వాటి యజమానులు లక్షల్లో నష్టపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లో కుక్కల దెబ్బకు 50 గొర్రెలు మరణిం చటంతో వాటిపైన్నే ఆధారపడ్డ ఓ కుటుంబం రోడ్డున పడింది. వీధి కుక్కలతోపాటు వానరాలు సైతం పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇటు జనావాసాలు, అటు పంట పొలాల్లో కిష్కింధకాండను సృష్టిస్తున్నాయి. వాటికి ధాటికి జనాలు ఇండ్లకు 24గంటలూ తలుపులేసుకోవాల్సి వస్తుండగా… రైతులు పంట పొలాల్లో కర్రలు పట్టుకుని కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇంత జరుగుతున్నా సర్కారు వారు మాత్రం కుక్కలు, కోతుల నియంత్రణకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనబడటం లేదు. అలా తీసుకుని ఉంటే వాటి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ ఉండేది కాదు. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో 2021లో 4.61 లక్షల కుక్కలుంటే… ఈ ఏడాదిలో ఇప్పటికే వాటి సంఖ్య ఏడు లక్షలకు దాటిందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వాటి నివారణా, నియంత్రణ కోసం గత ఐదేండ్లలో రూ.18 కోట్లను ఖర్చు చేశామంటూ ఏలికలు లెక్కలేసి చెబుతున్నారు. మరి ఇంత డబ్బును ఖర్చు చేసినా కుక్కలను ఎందుకు నియంత్రించలేక పోతున్నారనే ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ క్రమంలో కుక్కలు కరిచినప్పుడు రేబిస్ లాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వాటికి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యాక్సిన్లు వేయటం, వాటి సంఖ్య పెరగకుండా ఉండేందుకు అధునాతన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటమనేది ఒక కార్యక్రమంగా చేపట్టాలి. దీన్ని నిరంతరం కొనసాగించాలి. ఇందుకోసం జంతు నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులతో తక్షణమే ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. తద్వారా కుక్కలు లేదా కోతులు కరిచిన తర్వాత వైద్యం కంటే అవి కరవకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించటం ద్వారా వారిలో అవగాహన పెంపొందించాలి. ‘వానలు రావాలి.. కోతులు వనాలకు వాపస్ పోవాలి…’ అంటూ యాసలు, ప్రాసలతో కూడిన ప్రసంగాలకే ప్రభుత్వ పెద్దలు పరిమితం కాకుండా అవి నిజంగానే వాపస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. మరోవైపు పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) లాంటి సంస్థలు, జంతు ప్రేమికులమని చెప్పుకు తిరిగేవారు సైతం ప్రదీప్ మరణంలాంటి ఉదంతాలను గుర్తెరగాలి. కేవలం జంతువుల హక్కులంటూ నినదించకుండా సాటి మనుషుల ప్రాణాల గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వం కూడా వారితో చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి వారి తోడ్పాటు ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలి. లేదంటే చిన్నారుల ప్రాణాలకు, రైతులకు జరిగే నష్టానికి… వెరసి ఇలాంటి అనేకానేక ఘోరాలకు బాధ్యత ఎవరిదనేది సమాధానం లేని ప్రశ్నాగా మిగిలిపోకూడదు.