ఉత్తేజభరితం

– అరుణపతాకాన్ని ఆవిష్కరించిన పి.రాజారావు
– అమరవీరుల స్థూపానికి ప్రతినిధుల నివాళి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సిద్దిపేటలోని మల్లు స్వరాజ్యం నగర్‌ (రెడ్డి ఫంక్షన్‌హాల్‌)లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు ఉత్తేజపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సీఐటీయూ సీనియర్‌ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘సీఐటీయూ జిందాబాద్‌.. కార్మికవర్గ ఐక్యత వర్ధిల్లాలి.. మతోన్మాదం నశించాలి.. ఐక్యపోరాటాలను కొనసాగిస్తాం’ అంటూ ప్రతినిధులు, నాయకులు పెద్దఎత్తున నినదించారు. పీఎన్‌ఎమ్‌ కళాకారులు అమరవీరులను స్మరిస్తూ… ‘ఓ అరుణపతా కమా.. చేగొనుమా రెడ్‌ సెల్యూట్‌’ అంటూ పాట పాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, గిరిజన సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చిత్రపటాలకు సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హేమలత, తపన్‌సేన్‌, ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు, పరిశీలకులు అమరవీరుల స్థూపానికి రెడ్‌సెల్యూట్‌ చేశారు. తదనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. నివేదికపై వివిధ జిల్లాల, రంగాల నుంచి ప్రతినిధులు గ్రూపు చర్చల్లో పాల్గొన్నారు. సీఐటీయూ సీనియర్‌ నాయకులు ఆర్‌.సుధాభాస్కర్‌, జి.రాములు, ఎస్‌.నర్సింహారెడ్డి, ఎమ్‌డీ అబ్బాస్‌, బి.బిక్షమయ్య, రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్‌, ఎస్వీ.రమ, భూపాల్‌, మధు, రాగుల రమేశ్‌, బీరం మల్లేశ్‌, ఏజే రమేశ్‌, త్రివేణి, యాదానాయక్‌, చంద్రశేఖర్‌, ఎం.వెంకటేశ్‌, ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, పి.జయలక్ష్మి, మల్లిఖార్జున్‌, కల్యాణం వెంకటేశ్వర్లు, టి.వీరారెడ్డి, కోటంరాజు, వీఎస్‌.రావు, పద్మశ్రీ, ముత్యంరావు, మందా నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా.. సాయుధపోరాటాల ఖిల్లా
సీఐటీయూ మహాసభలు ప్రజాతంత్ర ఉద్యమానికి దోహదపడతాయి ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి
సిద్దిపేట జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు ఖిల్లాగా పేరుగాంచిందని, ఇలాంటి చోట సీఐటీయూ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉందని ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్లుస్వరాజ్యంనగర్‌లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో ప్రారంభ సభనుద్దేశించి ఆయన స్వాగత ఉపన్యాసం చేశారు. సీఐటీయూ మహాసభలు ప్రజాతంత్ర ఉద్యమాలకు దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో జరిగిన మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంత రైతుల పోరాటాల్లో సీఐటీయూ కార్మిక నేతలు పాల్గొని 21 రోజులు జైలుకెళ్లిన చరిత్ర ఉందని చెప్పారు. కార్మికులు, కర్షకుల ఐక్యత కోసం సీఐటీయూ పోషిస్తున్న పాత్ర మరిన్ని ఐక్యపోరాటాలకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద భావజాలం విస్తరిస్తున్న తరుణంలో సిద్దిపేటలో కార్మిక వర్గ మహాసభలు జరుపుకోవడం ప్రాధాన్యత నెలకొందన్నారు. మతోన్మాద భావజాలంపై ప్రజలను చైతన్యం చేయడంలో సీఐటీయూ చురుకైన పాత్రపోషించాలని అభిలాషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గడ్డపై జరుగుతున్న రాష్ట్ర మహాసభలు నిర్ధిష్టమైన కార్యాచరణ రూపొందించుకుని సమరశీల పోరాటాలకు శంఖారావం పూరించాలని ఆకాంక్షించారు.

Spread the love