ఉన్నోనికి లేదు.. లేనోనికి పరి’ఆ’హారం

–  ఇన్నర్‌’రింగ్‌’లో అవినీతి మంత్రాంగం
– రియల్టర్లు, రెవెన్యూ అధికారుల భూదందా
– నష్టపరిహారంలో ఫోర్జరీలతో దోపిడీ
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు బాధితుల పరిహారంలో పెద్దఎత్తున చేతులు మారుతోంది.. భూములు కోల్పోయిన వారికి అందించే నష్టపరిహారంలో ‘నకిలీ’ దందా నడుస్తోంది. రియల్టర్లు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నష్టపరిహారాన్ని దోచుకోవడానికి కొత్త కుంభకోణానికి తెరలేపారు. అసలు బాధితులకు భూమి పోవడం లేదని చెబుతూ, అసలు భూమే కోల్పోనివాళ్ల పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి నష్టపరిహారం దోచుకోవడానికి రంగం సిద్ధమైంది. 200 అడుగుల ఇన్నర్‌రింగ్‌ రోడ్డు తొలి దశలో వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారిపైనున్న నాయుడు పెట్రోల్‌ పంప్‌ నుంచి ఎనుమాముల మార్కెట్‌ వరకు 13 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేయనున్నారు. ఇందుకు వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాల్లో 87 ఎకరాల భూమిని సేకరించాల్సి వుంది. ఇందుకు రూ.110 కోట్లు నష్టపరిహారం కోసం ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడే పరిహారం పంపిణీలో మాయాజాలం నడుస్తోంది. ఎనుమాముల శివారులో సర్వేనెంబర్‌ 171/ఎ, 171/బిలో భూములు పోతున్నాయి. అయితే, రెవెన్యూ అధికారులు, రియల్టర్లు కుమ్మక్కై పట్టాదార్లకు సర్వేనెంబర్‌ 171/ఎలో భూమి పోవడం లేదని, 171/బిలో మాత్రమే రోడ్డు కింద భూమి పోతుందని చెబుతున్నారు. సర్వేయర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, తహసీల్దార్‌, రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ అందరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుందని ఆరా తీస్తే.. నకిలీ పత్రాలు సృష్టించి నష్టపరిహారాన్ని కాజేయడానికి దందా నడుపుతున్నట్టు సమాచారం. ఇందులో రెవెన్యూ అధికారులు ప్రత్యక్షంగా తమదైన శైలిలో పాత్ర పోషిస్తున్నారు. గజానికి రూ.7,500 నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించడంతో సర్వేనెంబర్‌ 171 పార్ట్‌ ఎ, పార్ట్‌ బిలో వున్న భూములకు సంబంధించి 2021లో పలువురి పేరిట నోటరీలతో పత్రాలను సృష్టించారు.
పత్రాలు తయారు
ఎనుమాముల శివారులోని సర్వేనెంబర్‌ 171/బిలో స్థలానికి సంబంధించి 1991లోని పాత పేపర్‌ను సృష్టించి నకిలీ నోటరీ /1198/2020, 31-12-2020 ఈ డాక్యుమెంట్‌ నెంబర్‌కు సంబంధించిన గిప్ట్‌ డీడ్‌ను అనుమల్ల వెంకటేశం పేరిట చేశారు. ఈ డాక్యుమెంట్‌లో పేర్కొన్న హద్దులన్నీ తప్పుగా నమోదు చేశారు. శాయంపేటలో సర్వేనెంబర్‌ 39లో డాక్యుమెంట్‌ నెంబర్‌ 139/1998, ఎస్‌ఆర్‌ఓ వరంగల్‌ రూరల్‌ 2010, తేదీ 20-09-1998న మున్నంగి పున్నారెడ్డి అనే వ్యక్తి ఊకల్‌ ఎబిఎఫ్‌ఎస్‌సిఎస్‌ లిమిటెడ్‌లో మార్టిగేజ్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్‌ నెంబర్‌ 139/1998ని గ్రామం పేరు మార్చి ఎనుమాముల అని.. 537 గజాలు, హద్దులు ఎనుమాముల సర్వేనెంబర్‌ 171/బి కి సంబంధించిన హద్దులు సృష్టించారు. ఈ హద్దులకు సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్‌ టి.రమేష్‌బాబు కో అండ్‌ కంపెనీ గండ్ర రాజకిషన్‌రావుకు సర్వేనెంబర్‌ 171/బిలో 537 గజాలుగా రిజిస్ట్రేషన్‌ చేశారు. 171/బి ఎనుమాముల గ్రామానికి సంబంధం లేని డాక్యుమెంటును ఎనుమాముల 200 అడుగుల రోడ్డు కింద భూనిర్వాసితుడిగా నమోదు చేసుకొని నష్టపరిహారం స్వాహా చేయడానికి ఈ తతంగం నడుపుతున్నారు.
ఈ విషయాన్ని అల్లం వెంకటేశ్వర్‌రెడ్డి అనే బాధితుడు సర్వేయర్‌, గిర్దావర్‌ రామస్వామి, వరంగల్‌ తహసీల్దార్‌ సత్యపాల్‌ రెడ్డి, ఆర్‌డీఓ సీహెచ్‌ మహేందర్‌ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని ‘నవతెలంగాణ’కు తెలిపారు. ఇందులో రెవెన్యూ అధికారుల పాత్ర లేకుండా ఇంత పెద్దఎత్తున వ్యవహారం జరగదని చెబుతున్నారు. 40 ఏండ్లుగా పట్టాదారులైన అల్లం అనిమిరెడ్డి, అల్లం వెంకటేశ్వర్‌రెడ్డికి చెందిన 1.20 ఎకరాల భూమి ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో పోతున్నా, ఈ భూమిని సర్వే చేయాలని ఆర్‌డీఓ, తహసీల్దార్‌కు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా తప్పుడు నివేదిక ఇచ్చినట్టు బాధితులు ఆరోపించారు.
రియల్టర్లు, రెవెన్యూ అధికారుల కుమ్మక్కు
ఎనుమాముల శివారులో గంజి గణేశ్‌ అనే వ్యక్తి పేరుతో సర్వేనెంబర్‌ 171/బి అని వేసి ప్లాట్‌ నెంబర్‌ 34 ఒక నకిలీ డాక్యుమెంట్‌ను తయారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ డాక్యుమెంట్‌లో పట్టాదారు పేరుండదు. జీపీఏ హోల్డర్‌ పేరు నమోదు కాదు, కానీ ఆయనకు సర్వేనెంబర్‌ 171/బిలో భూమి వుందని డాక్యుమెంట్‌ తయారు చేశారు. ఈ డాక్యుమెంటులో చూపిన హద్దులు 171/ఎకి సంబంధించిన జీపీఏ హోల్డర్‌ని హద్దులుగా సృష్టించి ఎంజారుమెంట్‌ సర్వే నిర్వహించడం గమనార్హం.
ఉన్నోనికి రాదు..
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో వాస్తవానికి కోల్పోతున్న భూమి ఎనుమాముల శివారులోని సర్వేనెంబర్‌ 171లోఎ, బి పార్ట్‌లో ఉంది. ఈ రెండు పార్ట్‌ల్లోని భూమి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో పోతుంది. సర్వేనెంబర్‌ 171/ఎ లోని భూమి రోడ్డు కింద పోవడం లేదని చెబుతూ బాధితులను మోసం చేస్తున్నారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నోటిఫికేషన్‌ వచ్చాక సంబంధిత భూముల్లో క్రయ, విక్రయాలు జరుపకూడదు. కానీ ఇక్కడ అక్రమ నోటరీలు, రిజిస్ట్రేషన్లు చేసి నష్టపరిహారాన్ని దోచుకోవడానికి నయా దందా షురూ చేశారు. వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారిపైనున్న నాయుడు పెట్రోల్‌ పంప్‌ నుంచి వసంతాపూర్‌, స్తంభంపల్లి, ఖిలా వరంగల్‌, జాన్‌పీరీలు, కీర్తినగర్‌, కోటిలింగాల, ఎనుమాముల మార్కెట్‌, పైడిపెల్లి శివారు, ఆరేపల్లి జంక్షన్‌ వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించాల్సి వుంది. మొదటి దశలో నాయుడు పెట్రోల్‌ పంప్‌ నుంచి ఎనుమాముల మార్కెట్‌ వరకు నిర్మించనున్న ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో జాన్‌పీరీల వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం మినహా ఇప్పటికే 6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 13 కిలోమీటర్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో 200 మంది రైతులు, ప్రజలు తమ భూములను కోల్పోతున్నారు. కానీ, నిజమైన బాధితులకు కాకుండా.. నకిలీ పత్రాలు సృష్టించి నష్టపరిహారం కాజేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. వెంటనే జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపి అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని భూనిర్వాసితులు కోరుతున్నారు.
ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం చర్యలు
ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి. వాటిని పెండింగ్‌లో పెట్టి ట్రిబ్యునల్‌కు పంపిస్తున్నాం. ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.
డాక్టర్‌ బి.గోపి- వరంగల్‌ జిల్లా కలెక్టర్‌

Spread the love