ఉపాధి హామీకి నిధులు పెంచాలి

–  వైద్య ఆరోగ్య రంగాన్ని మెరుగు చేయాలి
– వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ తీర్మానం
హౌరా నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
గ్రామీణ ప్రాంత ప్రజలకు అంతో ఇంతో ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ తీర్మానించింది. మహాసభ నాలుగోరోజైన శనివారం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. తొలుత వైద్య ఆరోగ్య రంగంపై ప్రతినిధి దుర్గాస్వామి తీర్మానం పెట్టారు. దేశంలో కరోనా అనంతరం వైద్య ఆరోగ్య రంగ ప్రాధాన్యత తెలిసిందని, ఈ నేపథ్యంలో ఈ రంగాన్ని మెరుగుపరచడంతోపాటు బడ్జెట్లో నిధులు కూడా పెంచాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పనులు లేక పోషకాహారలేమి తీవ్రంగా ఉందని అన్నారు. అలాగే తీవ్రమైన అనారోగ్యం బారినపడినా సరైన చికిత్స అందే పరిస్థితి లేదని వివరించారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలని తీర్మానించారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో పేదలకు అంతోఇంతో ఆసరాగా ఉన్న ఉపాధి హామీకి నిధులు తగ్గించడం సరికాదని వెంటనే నిధులు పెంచాలని తీర్మానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్వల్ప తగ్గుదల ఉటుందని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో చెప్పారని, వాస్తవంగా ఇది మరింత ఉందని వివరించారు. నిరుద్యోగం పేదరికం, పౌష్టికాహారలోపం, పిల్లల మరణాలు పెరుగుతున్నాయని తెలిపారు. యుపిఎ ప్రభుత్వంలో వామపక్షాల ఒత్తిడితో 2006లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 2010 నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇది అమలైందని వివరించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీకి నిధులు తగ్గుతున్నాయని తెలిపారు. గత బడ్జెట్లో 73 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే ఈ ఏడాది 60 వేల కోట్లకు తగ్గించారని వివరించారు. వాస్తవంగా ఉపాధి కరువైన సమయంలో నిధులు పెంచాల్సింది పోయి తగ్గించారని పేర్కొన్నారు. ఎక్కువ కుటుంబాలకు 50 రోజులు పని కూడా ఉండటం లేదని తీర్మానంలో పేర్కొన్నారు. నెలవారీ ఆర్థిక ఖర్చులు పెరిగాయని, దానికి అనుగుణంగా పెరుగుదల ఉండాలని చెప్పారు. జనవరి 2020 నుండి అక్టోబర్‌ 2022 మధ్యలో 14 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి నివేదిక తెలిపిందన్నారు.
మరోవైపు జిడిపి పెరిగిందని నివేదికలు పెడుతున్నారని, అంటే ఉపాధిలేని అభివృద్ధి అని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. నయా ఉదారవాద సంస్కరణల ప్రభావం దీనిద్వారా స్పష్టమవుతోందని, ముఖ్యంగా యువతకు ఉపాధి లభించడం లేదని వివరించారు. శ్రామికశక్తి క్రమంగా నాశనం అవుతోందని ఇది ప్రమాదరకమైన పరిణామమని తెలిపారు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి తగ్గుతోందని పేర్కొన్నారు. కేరళలో అయ్యంకాళి పట్టణ ఉపాధిగ్యారంటీ పథకం ప్రవేశపెట్టి అక్కడివారికి ఉపాధి కల్పించారని వివరించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ సథకం కింద 100 నుండి 150 రోజుల పని కల్పించాలని, కేరళ మాదిరి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు కోసం ఉద్యమించాలని తీర్మానించారు. మొత్తంగా ఏడు తీర్మానాలను మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒక తీర్మానంలో స్వల్ప పదమార్పు చేశారు.
సంఘం వెబ్‌సైట్‌ ప్రారంభం
మహాసభల చివరిరోజు మహాసభల అర్హతల వివరాలను స్టీరింగ్‌ కమిటీ సభ్యులు విక్రమ్‌ ప్రవేశపెట్టారు. ఈ మహాసభకు 695 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 637 మంది ప్రతినిధులు, 47 మంది కేంద్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 119 మంది పరిశీలకులుగా ఉన్నారు. వీరిలో 566 మంది పురుషులు, 119 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. వీరిలో ఎపికి చెందిన శరత్‌చంద్ర అతి పిన్నవయస్కుడు కాగా, సునీత్‌ కృష్ణచంద్ర చోప్రా సీనియర్‌ ప్రతినిధిగా నిలిచారు. ప్రతినిధుల్లో 321 మంది వ్యవసాయ కార్మిక రంగం నుండి రాగా, 368 మంది పూర్తికాలం కార్యకర్తలుగా ఉన్నారు. బెంగాల్‌కు చెందిన సచీంద్రానంద్‌రారు ఏడు సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఏడాదిపైన 11 మంది, రెండేళ్లపైగా 11 మంది మూడేళ్లకుపైగా ఏడుగురు, ఐదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు.

Spread the love