– కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
– మార్చి 14 వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టొద్దు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఉపాధ్యాయ బదిలీలకు బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మార్చి 14వ తేదీ వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసే అవకాశమున్నది. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాతే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టే అవకాశమున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్పౌజ్ టీచర్లకు పది అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నాన్ స్పౌజ్ టీచర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మూడు నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. ఆ తర్వాత మూల్యాంకనం ప్రక్రియ ఉంటుంది. అనంతరం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించి విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం కోసం పంపించినట్టు తెలిసింది. మంగళవారం రాత్రి లేదా బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నది. అయితే 2015 నుంచి పదోన్నతులు, 2018 తర్వాత ఉపాధ్యాయులకు బదిలీల్లేవు. ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులంతా ఎంతో ఆశగా ఉన్నారు. కానీ హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ ఆగిపోవడంతో వారందరూ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఉపాధ్యాయ బదిలీలకు 13,904 దరఖాస్తులు
హైకోర్టు ఆదేశాల ప్రకారం 317 జీవో ద్వారా వేరే జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో మంగళవారం సాయంత్రం నాటికి 13,904 మంది దరఖాస్తు చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,104 మంది, కరీంనగర్‌లో 733 మంది, మహబూబ్‌నగర్‌లో 653 మంది, వికారాబాద్‌లో 616 మంది, హన్మకొండలో 604 మంది, అత్యల్పంగా హైదరాబాద్‌లో ఒకరు, జోగులాంబ గద్వాలతో 147 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. మంగళవారంతో దరఖాస్తుల సమర్పణ గడువు ముగిసింది. అయితే ఆ టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ బదిలీలకు గతంలోనే 59,909 దరఖాస్తులొచ్చాయి. దీంతో మొత్తం 73,813 దరఖాస్తులను సమర్పించారు.