– పిలిస్తేనేగా వచ్చేది : ఈటల
– అసెంబ్లీలో వారిద్దరి మధ్య మాటామంతీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభలో శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. మంత్రి కేటీఆర్ స్వయంగా బీజేపీ శాసన సభ్యులు ఈటల రాజేందర్, రఘు నందన్‌రావు కూర్చున్న బల్ల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిరువురూ ఒకరినొకరు పలకరించుకున్నారు. రఘు నందన్‌రావునూ ఎలా ఉన్నావ్? అని అడిగారు. ఈ సమ యంలో రఘునందన్‌రావు నిల్చోవడానికి ప్రయత్నించగా ‘వద్దు.. వద్దు.. కూర్చోనే మాట్లాడు’ అని కేటీఆర్ వారించారు. ఆ ముగ్గురు మాట్లాడుతున్న క్రమంలో బీజేపీ మరో శాసనసభ్యుడు రాజాసింగ్ అక్కడికెళ్లారు. ఆ సమయంలోనే హాల్‌లోకి అడుగు పెట్టిన సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క కూడా వారి వద్దకు చేరుకోగానే..కేటీఆర్ పలుకరించి ఆపారు. అనంతరం భట్టి, ఈటల, కేటీఆర్ నవ్వుతూ కనిపించారు. ఈటల రాజేందర్ నెత్తిని నిమిరుతూ భట్టి విక్ర మార్క నవ్వారు. అంతలోనే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సభలో వస్తున్నారనే సందేశంతో ఎవరి సీట్ల వద్దకు వారెళ్లి ఆసీనులయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనం తరం దీనిపై ఈటలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కేటీఆర్ తనను పలుకరించి ”ఏంటి అధికారిక కార్యక్రమా లకు కూడా రావట్లేదు. హుజురాబాద్ పర్యటనలో పాల్గొన లేదు” అడిగారని చెప్పారు. ఈ క్రమంలోనే ‘మీరు పిలిస్తేనే కదా నేను వచ్చేది? కనీసం కలెక్టర్ కూడా ఆహ్వానం పలు కరా? ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో సర్కారు తీరు సరిగ్గా లేదు’ అని కేటీఆర్‌కు చెప్పినట్టు ఈటల వివరించారు. ఆ సమయంలో భట్టి కూడా జోక్యం చేసుకుని తమని కూడా పిలవట్లేదు అన్నారనీ, దాంతో ముగ్గురం నవ్వుకున్నామని ఈటల చెప్పారు. శివాజీ తరహాలో గడ్డం పెంచుకుని కాషాయచొక్కా ధరించి వచ్చిన రాజాసింగ్‌ని కేటీఆర్ నవ్వుతూ పలుకరించారు. ఆ తర్వాత ‘ఈ రంగు చొక్కా నచ్చదు. కండ్లలో గుచ్చుకుంటున్నట్టు ఉన్నది’ అని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. దీనికి ప్రతిగా రాజాసింగ్ ‘మీరు కూడా భవిష్యత్తులో ఈ రంగు చొక్కా ధరించొచ్చు’ అని అన్నారని తెలిసింది.