ఎనిమిదేండ్ల ఆశ నిరాశే..

నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
8 ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కొత్త బడ్జెట్‌ తీవ్ర నిరాశ మిగిల్చిందని టీఎస్సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు నరేందర్‌ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పై ఆయన మాట్లాడుతూ వేతనాల్లో కోతలు తప్ప కొత్తగా ఊరటనిచ్చిన అంశం ఏమీ లేదన్నారు. 2023 బడ్జెట్‌ పాత సీసాలో కొత్త సారా లాగ ఉందనీ, పన్ను పరిధిని కొత్త పధ్ధతిలో 7లక్షలకు పెంచినా ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదన్నారు. పాత పద్ధతిలో 5 స్లాబ్‌లు పెంచినప్పటికీ ఉపయోగం లేదన్నారు. కొనుగోలు శక్తి తగ్గినప్పటికీ, ధరలు వంద రెండు వందల శాతం పెరిగిన, ఉద్యోగులు ఆశించిన ఊరట ఊరటగానే మారిందన్నారు. సీపీఎస్‌ ఉద్యగులకు 80డీ కింద ఇచ్చే రూ.50వేల మినహాయింపులో ఎలాంటి మార్పు లేదన్నారు. సీపీఎస్‌ ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు మార్కెట్‌ నుంచి ఉపశమహరించుకునే 60 శాతం డబ్బులపై పన్ను మినహాయింపు పరిధిని పెంచలేదన్నారు. 80సీ సెక్షన్‌ కింద వర్తించే పొదుపు 1.50లక్షలలో ఎలాంటి మార్పు లేదన్నారు. గృహ రుణాల వడ్డీ రేట్లు 7 శాతం నుంచి దాదాపుగా 10శాతం పెరిగినప్పటికీ వడ్డీ రాయితీలో ఇంతకు మునుపు ఇచ్చే రూ.2లక్షలు తప్ప ఎలాంటి మినహాయింపు లేకపోవడం దారుణమన్నారు. ఈ బడ్జెట్‌ను ఉద్యోగ వ్యతిరేక బడ్జెట్‌గా పరిగణిస్తున్నామన్నారు. గత 8 ఏండ్ల సంప్రదాయం కొనసాగిస్తూనే కార్పొరేట్‌ సంస్థ లకు కొమ్ము కాసే విధానాన్నే అవలంభించారన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విడిచే బడ్జెట్‌ తీవ్రంగా వ్యతిరేకస్తున్నామన్నారు.

Spread the love