ఎన్టీపీసీ ప్రాజెక్టులు పూర్తిచేయండి

–  ఎస్‌ఆర్‌పీసీ చైర్‌పర్సన్‌ డీ ప్రభాకరరావు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 2ఞ800 మెగావాట్ల సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్ని వెంటనే పూర్తిచేయాలని సదరన్‌ రీజియన్‌ పవర్‌ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) చైర్‌పర్సన్‌ దేవులపల్లి ప్రభాకరరావు ఆదేశించారు. 2022లోనే ఈ ప్రాజెక్ట్‌ ఆందుబాటులోకి రావల్సి ఉందనీ, ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. దీనివల్ల తెలంగాణ విద్యుత్‌ సంస్థలు బయటి నుంచి కరెంటు కొనాల్సి వస్తున్నదని చెప్పారు. వెంటనే ఈ రెండు యూనిట్లను కమిషన్‌ చేయాలని ఆదేశించారు. ఎస్‌ఆర్‌పీసీ సమావేశం శనివారం పూనాలో ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ జాతీయ నష్టాలు 4.49 శాతం ఉంటే, సదరన్‌ రీజియన్‌లో 3.88 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. సదరన్‌ రీజియన్‌ పరిధిలో వేసవి కాలంతో పాటు రబీ సీజన్‌ కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతున్నదనీ, దానికి అనుగుణంగా ట్రాన్స్‌మిషన్‌ లైన్లను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉందన్నారు. దానిలో భాగంగా తెలం గాణలో 132 కేవీ లైన్లను 220 కేవీ లైన్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ, రక్షణ చర్యలు చేపడుతున్నట్టు చె ప్పారు. నార్తర్న్‌ రీజియన్‌తో పోల్చితే సదరన్‌ రీజియన్‌ పనితీరు సంతృప్తి కరంగా ఉన్నదనీ, దీన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఆర్‌పీసీ సభ్యకార్యదర్శి ఆసిత్‌సింగ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల సీఎమ్‌డీలు పాల్గొన్నారు.

Spread the love