ఎన్నికల దారిలో.. హరీశ్‌ పద్దు…

– నాలుగు శాఖలు.. నాలుగు అంశాలకే అత్యధిక నిధులు
– ప్రజాకర్షణే లక్ష్యంగా కేటాయింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు గానీ…సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మాత్రం అదే సంకేతాలను ఇస్తున్నది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.2,90, 396 కోట్ల పద్దులో అత్యధిక భాగం నాలుగు శాఖలు, నాలుగు అంశాలకే దక్కాయి. అవన్నీ పూర్తిగా ప్రజాకర్షణతో కూడుకున్నవే కావటం గమనార్హం. ముఖ్యంగా ఆసరా పింఛన్ల కోసం రూ.12 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ కోసం రూ.3,210 కోట్లు, రైతు బంధుకు రూ.15,075 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించారు. ఈ నాలుగింటికి కలిపి రూ.42,285 కోట్లు అవుతున్నాయి. మొత్తం బడ్జెట్‌లో ఇది 14.56 శాతంగా ఉంది. మరోవైపు దళిత బంధు కోసం రూ.17,700 కోట్లను కేటాయించారు. పై నాలుగింటికి కేటాయించిన నిధులతో దళిత బంధు కేటాయింపులను కలిపితే మొత్తం రూ.59,985 కోట్లు అవుతున్నాయి. ఈ రకంగా మొత్తం పద్దులో ఇవన్నీ కలిపి 20.66 శాతంగా నమోదయ్యాయి. అంటే వీటికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిచ్చిందో విదితమవుతున్నది.
మరోవైపు పంచాయతీరాజ్‌ శాఖకు రూ.31,426 కోట్లు, షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు, నీటిపారుదల శాఖ రూ.26,885 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లను ప్రతిపాదించారు. ఈ నాలుగింటికి కలిపి మొత్తం రూ.1,21,892 కోట్లను కేటాయించారు. ఆ రీత్యా చూసినప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తమకు అవసరమైన కొన్ని ప్రాధాన్యతా రంగాలు, శాఖలకు ప్రభుత్వ పెద్దలు అధిక నిధులను వెచ్చించినట్టు ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love